హుజురాబాద్‌లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

by Ratna Kumari |

హుజురాబాద్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది.

హుజురాబాద్‌లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
X

దిశ,​హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. వరంగల్ ప్రధాన రహదారిపై పాపయ్య పల్లె క్రాస్ రోడ్ లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పెట్రోల్ బంక్ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపు చేయడంతో ఒక పెద్ద ముప్పు తప్పినట్లయింది.

​అసలేం జరిగిందంటే..?

​బంక్ యజమాని చొక్కయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మొదట షార్ట్ సర్క్యూట్ అయింది. దాని ప్రభావంతో బంకులోని ఎలక్ట్రిక్ కంట్రోల్ స్టార్టర్ ప్యానల్ సిస్టమ్ విద్యుత్ సరఫరా క్యాబిన్‌కు హైవోల్టేజ్ రావడంతో అక్కడ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. పొగలు, మంటలు రావడాన్ని గమనించిన పెట్రోల్ బంక్‌లోని వాహనదారులు, భయంతో ఆందోళనకు గురయ్యారు.

​సమయస్ఫూర్తి చాటిన సిబ్బంది...

​ప్రమాద తీవ్రతను గమనించిన బంక్ యజమాని చొక్కయ్య వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన సూచనలతో మేనేజర్ స్వామి, బంక్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంతో ముందుకు వచ్చారు. బంక్‌లో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలైన ఫైర్ ఎక్స్‌టింగిషర్స్ , కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లను, ఇసుక బకెట్లను ఉపయోగించి క్షణాల వ్యవధిలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

​ఊపిరి పీల్చుకున్న స్థానికులు..

​పెట్రోల్ బంక్ వంటి ప్రమాదకరమైన ప్రదేశంలో మంటలు వ్యాపించకుండా సకాలంలో అడ్డుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ మంటలు బంక్ లోపలికి లేదా పెట్రోల్ ట్యాంకులకు గనుక అంటుకుని ఉంటే.. బంక్ పేలిపోయి భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి సమయస్ఫూర్తితో వ్యవహరించి, పెద్ద ప్రమాదాన్ని తప్పించిన బంక్ మేనేజర్, సిబ్బందిని స్థానికులు, వాహనదారులు అభినందించారు.

Next Story