మరణంలోనూ వీడని బాధ్యత.. అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మనిచ్చిన కానిస్టేబుల్ శంకర్!

by Malleboina Mahesh |

మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ శంకర్! బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవ దానం చేసిన కుటుంబం. మానవత్వానికి నిదర్శనం.

మరణంలోనూ వీడని బాధ్యత.. అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మనిచ్చిన కానిస్టేబుల్ శంకర్!
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కొడుకు అవయవాలను దానం (Donate organs) చేసిన తల్లిదండ్రులు.. ముగ్గురికి పునర్జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా గుర్తు చేస్తూ.. కానిస్టేబుల్ శంకర్ (Constable Shankar,), కుటుంబ సభ్యుల నిర్ణయం పై ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కంబాల శంకర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కన్న కొడుకు ఇక లేడనే వార్త విన్న శంకర్ తండ్రి, కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలోనూ ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

అవయవ దానం - ప్రాణదానం

శంకర్ అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబం ముందుకు రావడంతో, 'జీవన్‌దాన్' ఆధ్వర్యంలో రెండు కిడ్నీలు, ఒక లివర్‌ను సేకరించారు. వీటిని అవసరమైన ముగ్గురు రోగులకు విజయవంతంగా అమర్చడం ద్వారా వారికి పునర్జన్మను ప్రసాదించారు. నిన్న (ఏప్రిల్ 1, 2026) పోలీస్ లాంఛనాలతో శంకర్ అంత్యక్రియలు నిర్వహించారు. దేశం కోసం సేవలందిస్తూ, చివరకు తన అవయవాల ద్వారా కూడా సమాజానికి మేలు చేసిన శంకర్ గారి త్యాగం మరువలేనిదంటూ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Next Story