కాసుల చదువు వద్దు.. సర్కారు బడే ముద్దు.. ఆదర్శంగా నిలిచిన ఖాకీ..!

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో విశ్వాసం పెంపొందాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులే ఆదర్శంగా నిలవాలని భావించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన కుమారుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

కాసుల చదువు వద్దు.. సర్కారు బడే ముద్దు.. ఆదర్శంగా నిలిచిన ఖాకీ..!
X

దిశ, తాడ్వాయి : ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో విశ్వాసం పెంపొందాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులే ఆదర్శంగా నిలవాలని భావించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన కుమారుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బక్కనోళ్ల రవి తన కుమారుడు బక్కనోళ్ల పృథ్వీక్‌ను తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మూడో తరగతిలో చేర్పించారు.

ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను ప్రభుత్వ విద్యావ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉంచానని, అదే నమ్మకాన్ని సమాజానికి సానుకూల సందేశంగా చాటాలనే ఉద్దేశంతో తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు రవి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయమని మండల విద్యాధికారి (ఎంఈఓ) రామస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

Next Story