రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఖిల్లా గణపురంలో కాంగ్రెస్ రాస్తారోకో

by Ratna Kumari |

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఖిల్లా గణపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఖిల్లా గణపురంలో కాంగ్రెస్ రాస్తారోకో
X

దిశ, ఖిల్లా గణపురం : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఖిల్లా గణపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. "మోడీ హటావో.. దేశ్ బచావో" నినాదాలతో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన వ్యవహారం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఆయనను అక్రమంగా అరెస్టు చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

Next Story