కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు డోపింగ్ షాక్.. గేమ్స్ నుంచి ఇద్దరు క్రీడాకారులు ఔట్

by Ramesh Naini |

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌‌లో భారత బృందానికి ముందే డోపింగ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు డోపింగ్ షాక్.. గేమ్స్ నుంచి ఇద్దరు క్రీడాకారులు ఔట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌‌లో భారత బృందానికి ముందే డోపింగ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా జూడో ఆటగాడు అరుణ్ కుమార్, వెయిట్‌లిఫ్టర్ దిల్బాగ్ సింగ్ ఈ ప్రతిష్టాత్మక క్రీడల నుంచి వైదొలిగారు.

డోపింగ్ వలలో జూడో అరుణ్ కుమార్

73 కిలోల విభాగంలో పోటీపడే భారత జూడో ఆటగాడు అరుణ్ కుమార్ (21) ఔట్-ఆఫ్-కాంపిటీషన్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. అతను అనాబాలిక్ స్టెరాయిడ్ వాడినట్లు తేలడంతో జాతీయ ఉత్ప్రేరక నిరోధక సంస్థ (NADA) అతడిపై తాత్కాలిక నిషేధం విధించింది. జూడో బృందం జులై 27న గ్లాస్గో బయలుదేరాల్సి ఉండగా, ఈ లోపే అరుణ్ కుమార్‌ను గేమ్స్ నుంచి ఉపసంహరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతంలో పారా స్విమ్మర్ తేజస్ నందకుమార్ క్లాసిఫికేషన్ ప్రమాణాల్లో విఫలమై తప్పుకోగా, ఇప్పుడు అరుణ్ కూడా దూరం కావడంతో భారత మొత్తం క్రీడాకారుల బృందం సంఖ్య 126 నుంచి 124 కి పడిపోయింది.

కోటా కోతతో వెయిట్‌లిఫ్టర్ దిల్బాగ్ సింగ్ ఔట్

వెయిట్‌లిఫ్టర్ దిల్బాగ్ సింగ్ డోపింగ్‌కు పాల్పడకపోయినా.. ఇతర క్రీడాకారుల తప్పు వల్ల అవకాశం కోల్పోయాడు. క్వాలిఫికేషన్ వ్యవధిలో (2025 జూన్ 1 నుంచి 2026 జులై 22 వరకు) ఏకంగా ఐదుగురు భారత లిఫ్టర్లు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడ్డారు. కామన్వెల్త్ నిబంధనల (క్లాజ్ 2.4) ప్రకారం, ఉల్లంఘనలకు పెనాల్టీగా భారత్ వెయిట్‌లిఫ్టింగ్ కోటాను 16 నుంచి 11కు కుదించారు. ఈ కోత వల్ల ఎవరైనా ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి తలెత్తడంతో.. దిల్బాగ్ సింగ్‌ను వెనక్కి పిలిపించినట్లు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (IWLF) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ వెల్లడించారు. పైగా దిల్బాగ్ గాయంతో బాధపడుతున్నందున అతడినే ఎంపిక చేసినట్లు తెలిపారు.

విఫలమైన పీటీ ఉష విజ్ఞప్తి

తప్పు చేసిన వారు ఇప్పటికే జట్టుకు దూరమయ్యారని, కాబట్టి వారి తప్పుకు అర్హత సాధించిన నిజాయితీ గల క్రీడాకారులకు అన్యాయం చేస్తూ కోటాను కుదించవద్దని భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష.. కామన్వెల్త్ స్పోర్ట్స్ నిర్వాహకులకు లేఖ రాశారు. మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరినా, నిర్వాహకులు నిబంధనలకే కట్టుబడటంతో దిల్బాగ్ సింగ్ నిష్క్రమణ తప్పలేదు.

Next Story