Red Sea: ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతలు.. సౌదీ చమురు నౌకలపై హూతీల దాడి

by Ramesh Naini |

ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు నౌకలపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు.

Red Sea: ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతలు.. సౌదీ చమురు నౌకలపై హూతీల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు నౌకలపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. కీలకమైన ఈ నౌకా రవాణా మార్గంలో దాడులు పెరగడం వల్ల ప్రపంచ ముడిచమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడింది.

లక్ష్యంగా మారిన నౌకలు.. హూతీల హెచ్చరిక

ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న ‘ఎన్సేలియా’, ‘లైలా’ అనే రెండు సౌదీ చమురు నౌకలపై దాడులు చేశామని, దీంతో వాటిలో మంటలు చెలరేగాయని హూతీ సంస్థ ‘సబా’ తెలిపింది. ఎన్సేలియా నౌకపై దాడి జరిగినట్లు సౌదీ అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశాయి. యెమెన్‌పై సౌదీ ఆర్మీ విధిస్తున్న దిగ్బంధనానికి ప్రతీకారంగానే బాబ్ ఎల్-మందేబ్ జలసంధి గుండా వెళ్లే సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని, ఈ దిగ్బంధనం ఎత్తివేసే వరకు దాడులు కొనసాగుతాయని హూతీలు హెచ్చరించారు.

మరింత తీవ్రమైన అమెరికా-ఇరాన్ పోరు

మరోవైపు ఇరాన్‌పై అమెరికా వరుసగా 12వ రోజు కూడా క్షిపణి దాడులను కొనసాగించింది. పశ్చిమ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా విరుచుకుపడగా, హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరుదేశాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

ఫలించని దౌత్య యత్నాలు

పశ్చిమాసియాలో క్షీణిస్తున్న పరిస్థితులను అదుపు చేసేందుకు పాకిస్తాన్, తుర్కియే వంటి దేశాలు తీవ్రస్థాయిలో దౌత్య యత్నాలు చేస్తున్నప్పటికీ, అమెరికా-ఇరాన్‌ల కఠిన వైఖరి వల్ల శాంతి చర్చలు కొలిక్కి రావడం లేదు. అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మందేబ్, హోర్ముజ్ జలసంధుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Next Story