సీఎం రేవంత్ ఇలాకా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం

by Malleboina Mahesh |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా అయిన కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

సీఎం రేవంత్ ఇలాకా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు(శుక్రవారం 13-02-2026) ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. తెలంగాణలోని అత్యధిక మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.

కొడంగల్ మున్సిపాలిటీ లోని మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ ఏకంగా 10 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కేవలం ఒక్కో వార్డు కే పరిమితం కాగా, ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఓటర్లు నీరాజనం పట్టారని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది.

ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మాత్రం అధికార కాంగ్రెస్ కు షాక్ తగిలింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ వార్డులను గెలుచుకుని ఇక్కడ గులాబీ జెండాను ఎగురవేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ, ఇబ్రహీంపట్నం వంటి కీలక పట్టణాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం. మొత్తంగా మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాలను బట్టి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలపై పట్టు సాధించే దిశగా సాగుతుండగా, బీఆర్ఎస్ కొన్ని కీలక స్థానాల్లో తన ఉనికిని చాటుకుంది.

Next Story