- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ కోసం 26 ఏళ్లు పనిచేశా.. చివరి కోరిక చెప్పి కన్నుమూసిన కాంగ్రెస్ నేత
రాజకీయ కక్ష సాధింపు మరోసారి రక్తం చిందించింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్గపోరు అగ్గి రాజుకుంది.

దిశ, గీసుకొండ: రాజకీయ కక్ష సాధింపు మరోసారి రక్తం చిందించింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్గపోరు అగ్గి రాజుకుంది. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆడుప మహేశ్ దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జన్ను మధు అనే వ్యక్తి ఆడుప మహేశ్‌కు ఫోన్ చేసి కోటిలింగాల ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని చెప్పినట్లు సమాచారం. దీంతో అక్కడికి వెళ్లిన మహేశ్‌ను పత్రి కుమార్ అడ్డగించాడు. మద్యం మత్తులో ఉన్న వారు ఎమ్మెల్యే దగ్గర మా గురించి ఏం చెప్పావ్ అంటూ నిలదీసినట్టు సమాచారం. మహేష్ సమాధానం చెప్పేలోపే అతని ఫోన్ లాక్కొని, ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. దీంతో తీవ్ర గాయాలపాలైన మహేశ్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని తన గ్రామానికి చేరుకున్నాడు.
స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, ఆయన శరీరంలో సుమారు 50 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మహేశ్ మృతి చెందారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన పత్రి కుమార్ పై ఇప్పటికే ఓ హత్య కేసు ఉన్నట్లు సమాచారం. ఆ కేసులో కోర్టు జీవిత ఖైదు విధించినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాను. నాపై దాడి చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలి. లేకుంటే నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితులు పరారీలో ఉన్నారని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.






