కాంగ్రెస్‌కు చేతకాకనే డైవర్షన్ పాలిటిక్స్: ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం

by Malleboina Mahesh |

కాంగ్రెస్ హామీలపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్ధం, దమ్ముంటే రండి.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్!

కాంగ్రెస్‌కు చేతకాకనే డైవర్షన్ పాలిటిక్స్: ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ (MP Dr. Lakshman) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనపై విరక్తి చెంది ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ హామీలన్నింటినీ గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి తో పాటు మహిళలకు నెలకు ఆర్థిక సహాయం, రూ. 4,000 పెన్షన్, పెళ్లిళ్లకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటర్లు ఇస్తామని ఆశ చూపిందని.. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా పక్కాగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఈ అబద్ధపు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చర్చించే దమ్ముంటే, వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి బహిరంగ చర్చకు రావాలని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఇదే సమయంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని కొనియాడారు. కులమతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారికి కూడా అందేలా మోదీ నిర్ధారించారని, అందుకే దేశ ప్రజలు పదేపదే బీజేపీ నాయకత్వాన్ని నమ్మి గెలిపిస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బురదజల్లే రాజకీయాలు ఆపి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Next Story