అభాసుపాలవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో చేస్తున్న డ్రామాలతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అభాసుపాలవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో చేస్తున్న డ్రామాలతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో అందరి కొంపలు ముంచిన కేటీఆర్‌ (KTR)ను సాక్షిగా విచారణకు పిలిచి వాంగ్మూలం తీసుకోవడమే విడ్డూరంగా ఉందన్నారు. ఫాంహౌస్‌కు, ఏఐసీసీకి మధ్య డీల్ కుదిరేదాకా ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో డ్రామాలు కొనసాగిస్తారని అన్నారు. ఇవాళ హకీంపేటలో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మీడియాతో మాట్లాడుతూ.. సమర్థవంతమైన, నిజాయితీవంతులైన అధికారులు సిట్‌లో ఉన్నారని చెప్పిన బండి సంజయ్, వారిని స్వేచ్ఛగా పని చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందని అన్నారు. తాము చెప్పినట్లుగా విచారణ జరగాలని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. ప్రజలు ఫోన్ ట్యాపింగ్ విచారణను చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత తేటతెల్లమవుతోందని బండి సంజయ్ విమర్శించారు.

ఇక రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి, కేంద్రం నిర్వహిస్తున్న ఉద్యోగాల భర్తీకి ఉన్న తేడాను గమనించాలని కోరారు. టీజీపీఎస్సీ (TGPSC) అంటేనే లీకేజీలు, పైరవీలు, కోర్టు కేసులని అన్నారు. ఆందోళనలు, ధర్నాలతో ఏళ్ల తరబడి పరీక్షలు, నియామకాలు సాగుతున్నాయని కామెంట్ చేశారు. కానీ, మోదీ ప్రభుత్వం ఒక్క పైరవీకి, అవినీతికి, లీకేజీలకు ఆస్కారం లేకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసినా చేయకపోయినా నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలతో నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలబడుతూ పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Next Story