ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది : కేంద్రంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-15 08:27:05  IST  )

దేశంలో ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడి నడ్డి విరిచేలా ధరల పెంపుకు కేంద్రం తెరలేపిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది : కేంద్రంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగియడమే ఆలస్యం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా ధరల పెంపునకు తెరలేపిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధాని మోదీని 'ఇన్‌ఫ్లేషన్ మ్యాన్' (ద్రవ్యోల్బణ బాబు) గా అభివర్ణిస్తూ, ఎన్నికల కోసం ఇన్నాళ్లూ అదుపులో ఉంచిన ధరలను ఇప్పుడు ఒక్కసారిగా పెంచేస్తున్నారని ఆరోపించింది.

సామాన్యులపై వసూళ్ల బాదుడు

తాజా నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచడంపై కాంగ్రెస్ మండిపడింది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయని, ఇది సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను తలకిందులు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పెట్రో ఉత్పత్తులే కాకుండా, CNG ధరలను కూడా కేజీకి 2 రూపాయలు పెంచడంపై ఎక్స్ (X) వేదికగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. "ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు తగ్గించినట్లు నటించి, ఓట్లు పడగానే అసలు వసూళ్లు మొదలుపెట్టారు" అంటూ మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.

'మోడీ రికవరీ' మొదలైంది

ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, ఇప్పుడు ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసే పనిలో (Recovery) ప్రభుత్వం నిమగ్నమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, సామాన్యుడి కష్టాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయని విమర్శించింది. ప్రభుత్వ ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుల జీవితాలు మరింత దుర్భరంగా మారుతాయని ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభుత్వ తప్పిదానికి ప్రజలకు మూల్యమా..! పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ గాంధీ నిప్పులు

Next Story