సియోరా వెంచర్‌ పై సమగ్ర విచారణ చేయండి..

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి, మైలారం, ఫకీర్‌గూడెం గ్రామాల్లో సియోరా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫామ్‌ల్యాండ్ వెంచర్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై దిశ పత్రిక గత నాలుగు రోజులుగా వరుస కథనాలను ప్రచురించింది.

సియోరా వెంచర్‌ పై సమగ్ర విచారణ చేయండి..
X

దిశ, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి, మైలారం, ఫకీర్‌గూడెం గ్రామాల్లో సియోరా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫామ్‌ల్యాండ్ వెంచర్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై దిశ పత్రిక గత నాలుగు రోజులుగా వరుస కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఏజేసీ భాస్కర్‌రావు మండలంలో పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దిశ పత్రికలో ప్రచురితమైన కథనాలకు సంబంధించిన అంశాలపై అధికారులను వివరణ కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేశారా ? వెంచర్ ఏర్పాటు చేసినట్లయితే, నిబంధనల మేరకు 10 శాతం భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించారా ? దాదాపు ఏడేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు ? సంబంధిత భూముల రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎంపీవో స్పందిస్తూ, వెంచర్‌కు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను మండల అధికారులు ఎంత మేరకు అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. గత నాలుగు రోజులుగా వెలుగులోకి వచ్చిన వెంచర్ అక్రమాలపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల అండదండలు రియల్ ఎస్టేట్ నిర్వాహకులకు ఉన్నాయా అనే సందేహాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

Next Story