ఫిర్యాదులు ఫుల్ సమస్య పరిష్కారాలు నిల్

by Ratna Kumari |   (  Updated:2026-06-23 16:20:36  IST  )

బడంగ్ పేట్ సర్కిల్ పరిధి ఉన్న సమస్యలను పరిష్కరించడం లో అధికారులు విఫలం అయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఫిర్యాదులు ఫుల్ సమస్య పరిష్కారాలు నిల్
X

దిశ బడంగ్ పేట్ : బడంగ్ పేట్ సర్కిల్ పరిధి ఉన్న సమస్యలను పరిష్కరించడం లో అధికారులు విఫలం అయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీలు పొంగుతున్న,రోడ్లు గుంతల మయమైన పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పన్నులు కడుతున్న తమ కాలనీ లో ఉన్న సమస్యలను ఆశించిన మేర పరిష్కారం కావడం లేదని కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని అంటున్నారు,శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ,బడంగ్ పేట్ సర్కిల్ డిసి సమ్మయ్య కు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బడంగ్ పేట్ మెయిన్ రోడ్డు పై డ్రైనేజీ పొంగిపోయి రోడ్డు పై ప్రవహిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు.నాదర్ గుల్ డివిజన్ పరిధి లోనీ వినాయక హిల్స్,మధురాపురి కాలనీ నిత్యం డ్రైనేజీ పొంగి రోడ్ల పై ప్రవహిస్తూ చుట్టుపక్కల కాలనీ ప్రజలకు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బడంగ్ పేట్, ఆదిభట్ల కు వెళ్ళేం రోడ్లు గుంతల మయమైవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కనీసం గుంతల పూడ్చే ప్రయత్నం కూడా అధికారులు చేపట్టడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ప్రమాదాలు జరిగి గాయపడిన అధికారులు ఇంకా మేలుకోవడం లేదు.అదేవిధంగా అల్మాస్ గూడ నుండి గుర్రంగూడకు వెళ్లే రహదారి సైతం గుంతలు వేరుపడిన పూడిచే ప్రయత్నం అధికారులు ఇప్పటి వరకు చేపట్టలేదు.ప్రధాన రహదారుల పరిస్థితి ఈ విధంగా ఉంటే కాలనీలో పరిస్థితులు మరి అద్వానంగా తయారయ్యాయి.దీంతో ప్రజలు బడంగ్ పేట్ సర్కిల్ అధికారుల పై తీవ్రస్థాయి లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యలను పరిష్కరించాలని,క్షేత్రస్థాయి లో పర్యటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఊరంతా లీడర్లే పరిష్కారం మాత్రం శూన్యం
అల్మాస్ గూడ లీడర్లు గ్రేట్..

ఊరంతా లీడర్లే ఉన్నారు. కానీ రోడ్డు రిపేరు చేయించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి కార్యక్రమంలో తాము పెద్ద లీడర్లు అంటూ గొప్పలు చెప్పుకుంటారు.కానీ అల్మాస్ గూడ అంబేద్కర్ విగ్రహం నుంచి గుర్రంగూడ రహదారిని ఐదేండ్ల క్రితం వేశారు. వేసిన నెల రోజులకే వాటర్ వర్క్స్ వాళ్లు పైపు లైను కోసం పూర్తిగా తవ్వేశారు. నెల రోజులకే తవ్వుతుంటే ఎవరూ అడ్డుకోలేదు.కనీసం వాటర్ పైపు లైన్ వేశాక రోడ్డు వేయాలన్న సూచనలు చేయలేదు.కానీ పూర్తిగా ధ్వంసమైంది.ఐదేండ్ల నుంచి నేటి వరకు కనీసం రిపేరు చేయడం లేదు. ప్రస్తుతం ఆ ఏరియాలో 30 మంది లీడర్ల వరకు ఉన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ లీడర్లు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ నెల రోజులకే తవ్వేసిన రోడ్డును పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. పైగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచర గణం కూడా చాలా మంది ఉన్నారు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఉవ్వీల్లూరుతున్నారు. కానీ ప్రధాన రహదారిని బాగు చేయించే స్థోమత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story