మాంటిస్సోరి స్కూల్‌పై విద్యాశాఖాధికారికి ఫిర్యాదు!

by Jakkula.Mamatha |

అలంపూర్ మండల కేంద్రంలోని మాంటిస్సోరి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు ఇస్తున్న ప్రాధాన్యతను స్థానిక తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు తీవ్రంగా ఆరోపించారు.

మాంటిస్సోరి స్కూల్‌పై విద్యాశాఖాధికారికి ఫిర్యాదు!
X

దిశ, అలంపూర్: అలంపూర్ మండల కేంద్రంలోని మాంటిస్సోరి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు ఇస్తున్న ప్రాధాన్యతను స్థానిక తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు తీవ్రంగా ఆరోపించారు. పాఠశాలలో జరుగుతున్న పలు అక్రమాలపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మండల విద్యాశాఖాధికారి (MEO) ఆర్.అశోక్ కుమార్‌కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం.. 25 శాతం సీట్లను పేద, అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉన్నా.. ఈ పాఠశాల దాన్ని తుంగలో తొక్కిందని నేతలు ధ్వజమెత్తారు. పాఠశాల కార్మికులతో సమయంతో సంబంధం లేకుండా రోజుకు 14 గంటల పాటు వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వారికి ఎలాంటి పీఎఫ్, ఈఎస్ఐ లేదా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించడం లేదనీ తెలిపారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాల యాజమాన్యం అనధికారికంగా వసతి గృహం(హాస్టల్) నడుపుతోందని, గత ఏడాది ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయిన ఆ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టారని ఆరోపించారు. వసతి గృహంలో అనేక అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. జిల్లా స్థాయి అధికారులకు లంచాలు ఇస్తూ యాజమాన్యం మేనేజ్ చేస్తోందని మండిపడ్డారు. అనుమతి లేకుండా నడుపుతున్న హాస్టల్‌పై మరియు యాజమాన్యంపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. అన్యాయంగా తొలగించిన స్థానిక ఉద్యోగులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే, రాబోయే రోజుల్లో పాఠశాల ముందు పెద్ద ఎత్తున 'రిలే నిరాహార దీక్షలు' చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయన్న, కేవీపీఎస్ టౌన్ కార్యదర్శి అయ్యప్ప, గంగన్న, అలాగే బాధితులు జి. శేఖర్, ఆర్. రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story