గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో నేరడిగొండ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్

by Batti.Sumithra |

గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు.

గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో నేరడిగొండ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్
X

దిశ, ఇచ్చోడ : గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. గ్రామంలోని వాహనాలు, అనుమానిత వ్యక్తులు, అక్రమ కార్యకలాపాల పై విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 30 లీటర్ల ఐడీ వాష్‌ను (బెల్లం పాకం) ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో 28 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోరిక్షాలు, 2 ట్రాక్టర్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల పై 54 చలానా కేసులు నమోదు చేసి జరిమానాలు చెల్లించినట్లు తెలిపారు.

నంబర్ ప్లేట్ లేని ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. గుడుంబా తయారీ, విక్రయం, మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ఎల్ శ్రీకాంత్, సయ్యద్ ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story