భారీగా తగ్గిన కమర్షియల్ LPG, జెట్ ఫ్యూయెల్ ధరలు

by Muthe.Rajitha |

దేశంలోని వ్యాపార వర్గాలకు, విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

భారీగా తగ్గిన కమర్షియల్ LPG, జెట్ ఫ్యూయెల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని వ్యాపార వర్గాలకు, విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండటం, మిడిల్ ఈస్ట్ లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత మేర సడలడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లతో పాటు విమాన ఇంధనం (ATF) ధరలను గణనీయంగా తగ్గించారు. సవరించిన ఈ కొత్త ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి.

హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ ఊరట

వ్యాపార వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించారు. ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,930కి చేరింది. దీనితో పాటు, చిన్న వ్యాపారులకు ఉపయోగపడే 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.13 మేర తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సేవలు, చిన్న తరహా వ్యాపారాల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గనుంది. అయితే, సామాన్య గృహ వినియోగదారులకు మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇళ్లలో వాడే 14.2 కేజీల గృహ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచారు.

భారీగా తగ్గిన విమాన ఇంధనం ధరలు

మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ విమానయాన రంగానికి కూడా మంచి వార్త అందింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరను లీటరుకు రూ.5 మేర తగ్గించారు. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధనానికే దాదాపు 35-40% ఖర్చవుతుంది. తాజా తగ్గింపుతో విమాన సంస్థల ఆపరేటింగ్ ఖర్చులు తగ్గి, రాబోయే రోజుల్లో ప్రయాణికులకు టికెట్ ధరల రూపంలో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

Next Story