- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజులు గాలించి పట్టుకుంటే.. 3 గంటల్లో పోలీస్ స్టేషన్ నుంచి పరారీ
హైరదాబాద్ నార్సింగి పోలీసు స్టేషన్ నుంచి డ్రగ్స్ కేసులలో నిందితుడిగా ఉన్న ముజఫర్ పరారీ కావడం పోలీసుల్లో కలకలం రేపింది.

దిశ, సిటీక్రైం: హైరదాబాద్ నార్సింగి పోలీసు స్టేషన్ నుంచి డ్రగ్స్ కేసులలో నిందితుడిగా ఉన్న ముజఫర్ పరారీ కావడం పోలీసుల్లో కలకలం రేపింది. డ్రగ్స్ దందాను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఈగల్ అధికారులు నెల రోజుల పాటు ముజఫర్‌పై నిఘా పెట్టి మంగళవారం పట్టుకున్నారు. అతనిని విచారించి తదుపరి దర్యాప్తు కోసం ఈగల్ అధికారులు నార్సింగ్ పోలీసు స్టేషన్‌కు అప్పజెప్పారు.
పారిపోయేందుకు డ్రామా ఇలా..
నార్సింగి పోలీసు స్టేషన్‌లో అప్పజెప్పిన తర్వాత ముజఫర్ తనకు కడుపులో నొప్పి వస్తుందని తనను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని చెప్పాడు. తనకు అర్నియా ఉందని నొప్పిని భరించలేకపోతున్నానని నమ్మించి తాను బాత్ రూమ్ కు వెళ్తానని చెప్పి స్టేషన్‌లోని విజిటర్స్ బాత్ రూంలోకి వెళ్ళాడు. ఆ బాత్ రూంలో వెంటిలేటర్‌కు గ్రిల్ లేకపోవడంతో దాంట్లో నుంచి దూరి బయటికి వచ్చి పోలీసు స్టేషన్ గోడ దూకి పరారైయ్యాడు.
నన్ను కొట్టి డబ్బులు గుంజుకున్నారు...
పోలీసు స్టేషన్ గోడ దూకి బయటికి వచ్చిన ముజఫర్ రోడ్డు పైకి వచ్చి ఓ క్యాబ్‌ను ఆపాడు. ముజఫర్ బట్టలు చినిగిపోయి ఉండడంతో డ్రైవర్ అనుమానం వచ్చి ఏమైందని అడిగాడు. నన్ను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి డబ్బులు, సెల్ ఫోన ను ఎత్తుకుపోయారని తెలిపాడు. తనను అత్తాపూర్ సమీపంలోని లెనిన్‌నగర్‌లో దించాలని, నీకు డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో డ్రైవర్ ముజఫర్‌ను లెనిన్‌నగర్‌లో వదిలేశాడు. అంతకు ముందు ముజఫర్ క్యాబ్ డ్రైవర్ ఫోన్‌ను తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి అప్రమత్తం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు ఈ విషయాలు తెలిశాయి.
గోడకు ఫెన్సింగ్ లేదు.. కిటికీకి గ్రిల్ లేదు..
ముజఫర్‌కు నార్సింగి పోలీసు స్టేషన్‌లోని విజిటర్స్ రూంలో ఉండే బాత్ రూంలోని వెంటిలేటర్‌కు గ్రిల్ లేదని, పోలీసు స్టేషన్ గోడకు కూడా ఫెన్సింగ్ లేదని ముందుగానే తెలిసినట్లు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిని నార్సింగి పోలీసు స్టేషన్‌కు తీసుకురాగానే అతను కడుపు నొప్పి అని చెప్పి నిందితులకు సంబంధించిన బాత్ రూం వైపు వెళ్ళాల్సి ఉండగా. విజిటర్స్ బాత్ రూంలోకి దూరి ఎస్కేప్ అయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే కార్పోరేట్ ప్రాంతంలో ఉన్న నార్సింగి పోలీసు స్టేసన్‌కు ఇలా ఫెన్సింగ్, కిటికీలకు గ్రిల్ లేకుండా ఉండడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయాలతో నిర్మించిన ఈ నార్సింగి కొత్త పోలీసు స్టేషన్‌లో ఇంత భద్రత లోపం ఉండడం విస్మయానికి గురి చేస్తుంది. ముజఫర్ కోసం పోలీసులు, ఈగల్ అధికారులు గాలిస్తున్నారు. ముజఫర్, అతని తల్లి, సోదరుడు కూడా డ్రగ్స్ దందా చేస్తుంటారని వీరి కూడా పోలీసు కేసులు ఉన్నట్లు అధికారులు చెప్పుతున్నారు. ముజఫర్ అత్తగారి ఇళ్ళు ఢిల్లీ కావడంతో అతను అక్కడికి వెళ్ళి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముజఫర్ అత్తాపూర్‌లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.






