తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: టీవీకే (TVK) ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం

by Malleboina Mahesh |

తమిళనాడులో సీఎం విజయ్ (TVK) ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం.. 15 మంది ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంలో ముగ్గురు అరెస్ట్.. సెంథిల్ బాలాజీపై అనుమానాలు!

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: టీవీకే (TVK) ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, వివిధ పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక పెద్ద కుట్రను ఇంటెలిజెన్స్, పోలీస్ యంత్రాంగం భగ్నం చేసింది. టీవీకే ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, పార్టీ మారేందుకు ప్రయత్నించిన ఒక ప్రముఖ కన్సల్టెన్సీ ఉన్నతాధికారితో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం..?

ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే ఈ కుట్ర వెనుక డీఎంకే (DMK) సీనియర్ నేత, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ పాత్ర ఉన్నట్లు గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ విభాగానికి ముందస్తు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. కాగా, ఈ పరిణామాలకు ముందు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మీడియా వేదికగా.. "త్వరలోనే రాష్ట్రంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కూలిపోతుందని, తమిళనాడులో మళ్లీ ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా డీఎంకే వ్యూహాత్మకంగానే ప్రభుత్వంపై కుట్రకు తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తాజా ఆపరేషన్, అరెస్టులతో డీఎంకే పార్టీ తీవ్రమైన రాజకీయ, చట్టపరమైన చిక్కుల్లో పడిపోయింది.

Next Story