- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయం..
కామారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయం అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయం అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్య, క్రీడలు, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపడం తన లక్ష్యమని తెలిపారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని అన్నారు. తాను విద్యాభ్యాసం చేసిన కామారెడ్డి బాయ్స్ హైస్కూల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కామారెడ్డి బాయ్స్ హైస్కూల్‌లో ఏసీ తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, స్మార్ట్ లైబ్రరీ, పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం, ప్రత్యేక క్రీడా మైదానాలు, విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో రాష్ట్రంలోనే రోల్ మోడల్ ప్రభుత్వ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పనులకు సీఎంఆర్ నిధులతో పాటు అవసరమైతే తన సొంత నిధులను కూడా వినియోగించి త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు జర్మన్ టెక్నాలజీ డేలైట్ ఇందిరా గాంధీ స్టేడియం ఏర్పాటుకు ఎంఎస్‌ఎన్ ఫార్మా సంస్థ సీఎస్ఆర్ నిధుల 78 లక్షల తో బాధ్యతలు చేపట్టిందని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం
ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన తొమ్మిది కోట్ల రూపాయలతో 8 లేన్ అథ్లెటిక్స్ ట్రాక్, నాలుగు టెన్నిస్ కోర్టులు, వాలీబాల్ కోర్టు, యోగా భవన్, ఆధునిక జిమ్, మహిళలు–పురుషులకు వేర్వేరు డ్రెస్ చేంజింగ్ రూములు, రైఫిల్ షూటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మిస్తామని వెల్లడించారు. కామారెడ్డి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవ్వాలన్నదే తమ సంకల్పమన్నారు. దోమకొండ మండల కేంద్రంలో రూ.10 కోట్ల వ్యయంతో ఫైర్ స్టేషన్, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు లభించాయని తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తూ ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆధునిక రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాల విస్తరణ, పార్కుల అభివృద్ధి, జంక్షన్ల సుందరీకరణ, సీసీ రోడ్లు, పట్టణ పరిశుభ్రత, భూగర్భ మురుగు కాలువల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారులు, సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, రైతులకు విద్యుత్, సాగునీటి సౌకర్యాల మెరుగుదల, పల్లె ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, మహిళా సంఘాలకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు
కామారెడ్డి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించి యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలేశ్వరం (ప్రాణహిత–చేవెళ్ల) ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా చర్చిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో చేసిన మార్పుల వల్లే కామారెడ్డి జిల్లాకు సాగునీరు అందడంలో ఆటంకాలు ఏర్పడ్డాయని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో రూపొందించిన అసలు ప్రణాళిక ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేసి కామారెడ్డి రైతుల కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, మండల అధ్యక్షులు రాజా గౌడ్, నౌసిలాల్ నాయక్, నరేందర్ రెడ్డి, అంకం కృష్ణారావు, పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భీమ్ రెడ్డి, సుతారి రమేష్, తిరుమల గౌడ్, ఐరేని నర్సయ్య, సత్యం, అన్వర్ అహ్మద్, అంజద్, లడ్డు, వాజిద్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిక్, జావిద్, మాజీద్, మసూద్, యూనిస్, అధికారులు, రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






