- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఖైదీలకు ‘రేహాయ్’తో కొత్త జీవితం
జైలు శిక్షతో జీవితం ముగిసిపోదని, నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళా ఖైదీలకు గౌరవప్రదమైన భవిష్యత్తు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ జైళ్ల & దిద్దుబాటు సేవల శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దిశ, చంపాపేట్ : జైలు శిక్షతో జీవితం ముగిసిపోదని, నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళా ఖైదీలకు గౌరవప్రదమైన భవిష్యత్తు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ జైళ్ల & దిద్దుబాటు సేవల శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా ఖైదీల పునరావాసం, ఆర్థిక సాధికారత, అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ‘రేహాయ్’ (రేహాయ్ – రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఇనిషియేటివ్ ఫర్ ఉమెన్ ఇన్‌మేట్స్) కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రత్యేక మహిళా జైలులో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ జైళ్ల & దిద్దుబాటు సేవల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో, హెర్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు దివ్యా రెడ్డి, బాబీ కందహారి సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మహిళా ఖైదీలకు ఇప్పటికే ఉన్న కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్యాలను ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్‌కు అనుసంధానం చేసి, ప్రీమియం నాణ్యత కలిగిన ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నారు.
గతంలో నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక శిక్షణలో మహిళా ఖైదీలు కుట్టు, ఎంబ్రాయిడరీలో ప్రాథమిక నైపుణ్యాలు సాధించగా, ఇప్పుడు వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి డిజైనర్ దుస్తులు, ప్రీమియం హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హై-ఎండ్ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. దీంతో వారు విడుదల అనంతరం స్వయం ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవడంతో పాటు ఆర్థికంగా స్వావలంబులుగా ఎదిగే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తయారయ్యే ఉత్పత్తులను తెలంగాణ జైళ్ల శాఖ నిర్వహిస్తున్న అప్‌స్కేల్ మార్కెట్ ద్వారా తొలుత దక్షిణ భారతదేశంలో, అనంతరం దేశవ్యాప్తంగా ప్రీమియం మార్కెట్లలో విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించారు. మహిళా ఖైదీల ప్రతిభకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా, వారి ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ విలువను కల్పించడమే లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన దివ్యా రెడ్డి మార్గదర్శకత్వంలో మహిళా ఖైదీలు ఆధునిక డిజైనింగ్, నాణ్యత ప్రమాణాలు, ఫినిషింగ్, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన తయారీ విధానాల్లో శిక్షణ పొందనున్నారు. భవిష్యత్‌లో మహిళా ఖైదీలు రూపొందించిన డిజైనర్ దుస్తులతో లండన్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించి, వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ జైళ్ల శాఖ, హెర్ రైట్స్ ఫౌండేషన్ కార్యాచరణ రూపొందించాయి. ఈ సందర్భంగా డీజీపీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ జైలు శిక్ష అనేది జీవితానికి ముగింపు కాదు. నైపుణ్యాలను పెంపొందించి ఉపాధితో అనుసంధానం చేయడం ద్వారా మహిళా ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడమే ‘రేహాయ్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా. డి.శ్రీనివాస్, ఎన్. శివకుమార్ గౌడ్, టి. వెంకట లక్ష్మీ శ్రీనాథ్, బి.అమరావతి, హెర్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది, మహిళా ఖైదీలు పాల్గొన్నారు. శిక్ష నుంచి శక్తివైపు… మహిళా ఖైదీల జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, ప్రపంచ ఫ్యాషన్ వేదికల దిశగా తీసుకెళ్లే ‘రేహాయ్’ కార్యక్రమం తెలంగాణ జైళ్ల శాఖ పునరావాస విధానంలో ఒక మైలురాయిగా నిలవనుంది.






