రంగస్థల దిగ్గజం విజయ్ మెహతా కన్నుమూత.. ప్రధాని మోడీ నివాళి

by Malleboina Mahesh |

ప్రముఖ రంగస్థల, చలనచిత్ర దిగ్గజం విజయ్ మెహతా (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ఆధునిక మరాఠీ నాటకరంగ మార్గదర్శి అంటూ పీఎం మోదీ ఘన నివాళి అర్పించారు.

రంగస్థల దిగ్గజం విజయ్ మెహతా కన్నుమూత.. ప్రధాని మోడీ నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ చలనచిత్ర, నాటక రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, ప్రసిద్ధ దర్శకురాలు విజయ్ మెహతా (Vijay Mehta) మంగళవారం రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆధునిక మరాఠీ నాటకరంగంలో ప్రయోగాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆమె మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ మెహతా మరణం భారతీయ ప్రదర్శన కళా రంగానికి తీరని లోటని, నాటక, సినిమా రంగాల్లో అత్యున్నత శిఖరంగా నిలిచిన ఆమె సృజనాత్మకత, కళా నైపుణ్యం రాబోయే తరాల నటులు, దర్శకులకు ఎప్పటికీ ఒక నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతాయని ప్రధాని కొనియాడారు.

నాటకరంగంలో 'బాయి' అని ఆప్యాయంగా పిలవబడే విజయ్ మెహతా, ఆరు దశాబ్దాల పాటు తన అద్భుత ప్రస్థానం తో మరాఠీ థియేటర్ రూపురేఖలను మార్చేశారు. దిగ్గజ రచయిత విజయ్ టెండూల్కర్‌తో కలిసి 'రంగాయన్' అనే ప్రయోగాత్మక నాటక సంస్థను స్థాపించిన ఆమె.. 'రాబోహెబ్', 'పెస్టోంజీ' వంటి క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, గోవింద్ నిహలానీ 'పార్టీ' వంటి సినిమాల్లో అద్భుత నటనకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. భారతీయ కళారంగానికి ఆమె చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో సత్కరించింది. ఆమె మృతి పట్ల యావత్ కళాకారుల లోకం ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తోంది.

Next Story