- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీ ప్రైమరీ-అంగన్వాడీ పోరు.. పిల్లల భవిష్యత్తు గందరగోళంలో!
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక తల్లిదండ్రుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.

దిశ, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్కరణల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల విధానం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆశలు రేకెత్తించినప్పటికీ, స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ప్రస్తుతం గందరగోళానికి దారితీస్తోంది. ముఖ్యంగా తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రీ ప్రైమరీ పాఠశాలల మధ్య విద్యార్థుల చేరికల అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఖానాపూర్ గ్రామ శివారులో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కొనసాగుతోంది. అదేవిధంగా వెల్జాల్ గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మంజూరు చేశారు. ఇదే క్రమంలో చుక్కాపూర్ గ్రామానికి గత ఏడాది ప్రత్యేకంగా ప్రీప్రైమరీ పాఠశాల మంజూరు చేసి ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇటీవల తలకొండపల్లి, గట్టు ఇప్పలపల్లి, పడకల్, వెల్జాల్ గ్రామాలకు కూడా కొత్త ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయి.
చేరికలపై స్పష్టత లేక తల్లిదండ్రుల ఆందళన
అయితే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలా? లేక 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు అంగన్వాడి కేంద్రాల్లోనే కొనసాగాలా? అనే విషయంలో స్పష్టత లేక తల్లిదండ్రులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. గ్రామాల్లో అంగన్వాడి సిబ్బంది ఒకవైపు, ప్రీ ప్రైమరీ సిబ్బంది మరోవైపు తమ తమ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఒత్తిడి తీసుకురావడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.
పిల్లల తల్లిదండ్రులు గందరగోళంలో...
అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీల నమోదు నుంచి చిన్నారులకు పౌష్టికాహారం, బాలామృతం, గుడ్లు వంటి సౌకర్యాలు అందుతున్నాయి. మరోవైపు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, ప్రత్యేక బోధన అందిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏ పాఠశాల పిల్లల భవిష్యత్తుకు అనుకూలమో తల్లిదండ్రులు నిర్ణయించలేకపోతున్నారు.
గైడ్లైన్స్ లేక ప్రభుత్వ లక్ష్యానికే దెబ్బ
ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఫర్నిచర్, విద్యా సామగ్రి, సిబ్బందిని ఏర్పాటు చేసినప్పటికీ, స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోతే ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తున్న చిన్నారులను ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల వైపు ఆకర్షించాలంటే ముందుగా చేరికలపై స్పష్టత అవసరమని చెబుతున్నారు.
జిల్లా అధికారులు వెంటనే స్పందించాలి
ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా స్పష్టమైన గైడ్లైన్స్ విడుదల చేసి గ్రామాల్లో నెలకొన్న అయోమయానికి తెరదించాలని తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వ వ్యవస్థ అమలుపై ప్రజల్లో మరింత గందరగోళం నెలకొనే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






