ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే నాయిని

by Batti.Sumithra |

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 61 డివిజన్‌లోని వెంకటాద్రి నగర్, ప్రశాంత్ నగర్ లలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే నాయిని
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 61 డివిజన్‌లోని వెంకటాద్రి నగర్, ప్రశాంత్ నగర్ లలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నాటికి డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో 90 శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. శంకుస్థాపనలు చేయడం ప్రారంభోత్సవాలు నిర్వహించడం వరకే తమ బాధ్యత కాదని, నిర్ణీత గడువులో పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రతి పనికి కాలపరిమితి నిర్ణయించి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాజీపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వాల మాదిరిగా హామీలకే పరిమితం కాకుండా పనులు చేసి చూపిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాజీపేట రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను వేగవంతం చేశామని, త్వరలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా కాజీపేట బస్‌స్టాండ్ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నగరంలో ఎటువంటి భూ కబ్జాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అన్ని ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల హంటర్ రోడ్ లో కొందరు వ్యక్తులు చేసిన ఉదంతం ప్రజలు గమనించారని తెలిపారు. వైఎస్సార్ నగర్ సంబంధిత అంశం పై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ నిర్వహిస్తోందని చెప్పారు. ప్రైవేట్ భూములకు సంబంధించి కోర్టు తీర్పే అంతిమమని, ప్రభుత్వం న్యాయపరమైన నిర్ణయాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. భూమి ప్రభుత్వ స్థలమని తేలితే ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాకుండా కాపాడుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవసరమైతే ఆ స్థలంలో బస్‌స్టాండ్, పోలీస్ స్టేషన్ లేదా ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాగరిక రమాకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గాజపాక రమేష్, స్థానిక నాయకులు, అధికారులు రాజ్ కుమార్, హరికుమార్ స్థానిక కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story