- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీరే వచ్చి తనిఖీ చేసుకోండి’.. ఆర్టీఐ దరఖాస్తుదారునికి అధికారుల వింత సమాధానం!
ప్రజల హక్కులకు రక్షణగా నిలవాల్సిన సమాచార హక్కు చట్టం-2005(ఆర్టీఐ) ఆలేరు మున్సిపాలిటీ అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది.

దిశ, ఆలేరు: ప్రజల హక్కులకు రక్షణగా నిలవాల్సిన సమాచార హక్కు చట్టం-2005(ఆర్టీఐ) ఆలేరు మున్సిపాలిటీ అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. మున్సిపల్ అధికారులు పారదర్శకతను గాలికొదిలేసి, చట్టాన్ని చుట్టం చూపుగా మార్చేశారు. సమాచారం కోరుతూ మున్సిపాలిటీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న ఆర్టీఐ కార్యకర్తలను, పౌరులను ముప్పుతిప్పలు పెడుతూ వారికి చుక్కలు చూపిస్తున్నారు.
అవినీతి, అక్రమాలు బహిర్గతమవుతాయోననే!
ఆలేరు మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ కి సంబంధించిన ఆదాయ, వ్యయల కు సంబంధించిన ఫైల్స్ నకలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా "దిశ" రిపోర్టర్ నెల రోజుల క్రితం దరఖాస్తు చేశాడు. దీంతో మున్సిపాలిటీ అధికారులు తమ అవినీతి అక్రమాలు ఎక్కడ బహిర్గతం అవుతయానే భయంతోనే అధికారులు సమాచారాన్ని దాటవేస్తూ లేఖ నంబర్ ఆర్టీఐ /419/2026 ద్వారా కార్యాలయ పని వేళలో వచ్చి రికార్డులు తనిఖీ చేసుకోగలరని పొంతన లేని సమాధానలతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మున్సిపాలిటీలో జరిగిన పలు అభివృద్ధి పనులు, నిధుల మంజూరు, ఖర్చుల వివరాలపై ఆర్టీఐ కార్యకర్తలు దరఖాస్తులు చేస్తుంటే అధికారులు వింత పోకడలు అవలంబిస్తూ పొంతన లేని సమాధానాలు. అడిగిన సమాచార ప్రతులకు, అధికారులు ఇచ్చే సమాధానాలకు అసలు పొంతన ఉండటం లేదు. 'ఎక్కడో అడిగితే.. ఇంకెక్కడో' అన్నట్లుగా సమాధానాలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు. సమాచారం ఇవ్వడం ఇష్టం లేక, ఏదో ఒక సాకుతో దరఖాస్తులు తిరస్కరించడం లేదా అసంపూర్తి సమాచారంతో సరిపెట్టడం అధికారులకు అలవాటుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతి బాగోతం బయటపడుతుందనేనా?
మున్సిపాలిటీ పరిధిలో జరిగిన కొన్ని కీలక పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వివరాలు గనుక ఆర్టీఐ ద్వారా బయటకు వస్తే తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను తొక్కిపెడుతున్నట్లు తెలుస్తోంది."సమాచారం అడిగితే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. చట్టం ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో ఇవ్వాల్సిన సమాచారాన్ని నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు.
ఉన్నతాధికారులు స్పందించాలి..
చట్టాన్ని అపహాస్యం చేస్తూ, పౌరుల హక్కులను కాలరాస్తున్న ఆలేరు మున్సిపల్ అధికారుల తీరుపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సమాచారాన్ని దాటవేస్తున్న బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, తూట్లు పొడుస్తున్న సమాచార హక్కు చట్టానికి తిరిగి జీవం పోయాలని పట్టణ ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.






