ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల యాజమాన్యం

by Batti.Sumithra |

విద్య ద్వారానే జీవితాలు మారుతాయనేది అందరికీ తెలిసిన సత్యం.

ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల యాజమాన్యం
X

దిశ, అచ్చంపేట : విద్య ద్వారానే జీవితాలు మారుతాయనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే కొందరి జీవితాల్లో ఆ విద్యను పొందేందుకు ఎన్నో అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన ఆదివాసి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం ఇప్పటికీ అరుదుగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చెంచు గిరిజన విద్యార్థిని ఎన్నో కష్టాలను అధిగమించి బీటెక్ (సీఎస్‌ఈ) పూర్తి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా అందలేదనే కారణంతో కళాశాల యాజమాన్యం ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిలిపివేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్టిఫికెట్లు కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ విషయం ‘దిశ’ ప్రతినిధి ఆ విద్యార్థినిని కలిసిన సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే నాగర్‌కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలోని పదర మండలం ఊడిమిళ్ల గ్రామానికి చెందిన పాపమ్మ–బయన్న దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ఐదవ సంతానమైన ఎస్తేరమ్మ ఉన్నత విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే మన్ననూర్ ఐటీడీఏ నుంచి రూ.50 వేల ఆర్థిక సహాయం లభించడంతో ఆమె మిర్యాలగూడలోని మీనా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్‌ఈ) పూర్తి చేసింది. తదుపరి ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించగా, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా రాలేదని, అది వచ్చిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పినట్లు ఎస్తేరమ్మ తెలిపింది. ఒకవేళ వెంటనే సర్టిఫికెట్లు కావాలంటే కళాశాల ఫీజు కింద రూ.2 లక్షలు చెల్లించాలని యాజమాన్యం షరతు విధించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి అవరోధాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది.

రెండు నెలల క్రితం గుండెపోటుతో తండ్రి మృతి..

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తన తండ్రి బయన్న ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందాడని ఎస్తేరమ్మ తెలిపింది. కుటుంబ పోషణ భారం మొత్తం ప్రస్తుతం తన తల్లిపైనే పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో రూ.2 లక్షలు చెల్లించే స్థోమత తమకు లేదని వాపోయింది. కళాశాలలో చేరే సమయంలో ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదనే కారణంతో మా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాలాంటి అమాయక ఆదివాసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు జోక్యం చేసుకుని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా నా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి” అని ఎస్తేరమ్మ విజ్ఞప్తి చేసింది.

Next Story