- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ బదలాయింపుల వ్యవహారంలో కలెక్టర్ కొరడా
దమ్మపేట ఏజెన్సీలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జరిగిన భూ బదలాయింపుల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది.

దిశ, దమ్మపేట : దమ్మపేట ఏజెన్సీలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జరిగిన భూ బదలాయింపుల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ అంకిత్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా గ్రామ పరిపాలన అధికారి (జీపీవో)పై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్, అనంతరం బాధ్యుడైన మండల తహసీల్దార్‌ను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఆర్డీవో విచారణలో కుమ్మక్కు నిర్ధారణ..
ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఆర్డీవో నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణలో తహసీల్దార్, జీపీవో ఇద్దరూ కుమ్మక్కై నకిలీ పత్రాల ఆధారంగా భూ బదలాయింపులకు సహకరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధం లేని వ్యక్తులను వారసులుగా చూపిస్తూ నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతో భూ భారతి పోర్టల్లో సక్సెషన్ మాడ్యూల్ ద్వారా పాస్‌బుక్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో తప్పనిసరిగా నిర్వహించాల్సిన క్షేత్రస్థాయి విచారణను ఉద్దేశపూర్వకంగా చేపట్టలేదని ఆర్డీవో నివేదికలో తేలినట్లు పేర్కొన్నారు.
తీవ్ర దుష్ప్రవర్తనగా పేర్కొన్న కలెక్టర్..
అధికారుల చర్యలు తీవ్రమైన దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ఏజెన్సీ చట్టాల ఉల్లంఘనగా పరిగణించబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. టీజీసీఎస్ (సీసీఏ) నిబంధనలు–1991 ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని విచారణాధికారి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సస్పెన్షన్ కాలంలో ఇద్దరు అధికారులు దమ్మపేట కేంద్రంలోనే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం వారికి జీవనభృతి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దమ్మపేట కొత్త తహసీల్దార్‌గా మద్దినేని మురళి..
తహసీల్దార్ సస్పెన్షన్ నేపథ్యంలో మండల పరిపాలనకు అంతరాయం కలగకుండా జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అండర్ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని దమ్మపేట తహసీల్దార్ (ఎఫ్‌ఏసీ)గా డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే ఎస్‌ఐఆర్, ఇతర కీలక పరిపాలనా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.






