బడుల్లో కలెక్టర్ హల్‌చల్.. విద్యార్థుల మౌనంపై అసహనం

by Dishafeatures2 |
బడుల్లో కలెక్టర్ హల్‌చల్.. విద్యార్థుల మౌనంపై అసహనం
X

దిశ, మనోహరాబాద్: 'మన ఊరు - మన బడి' పథకంతో ఆంగ్ల బోధన, విద్యార్థుల భవిష్యత్తుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ చక్కని ప్రణాళికలు చేపట్టారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. మన ఊరు - మన బడిలో ఎంపిక చేసిన మనోహరాబాద్, కాళ్లకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం ఆయన సందర్శించారు. కాళ్లకల్ పాఠశాలలో వాట్ ఈస్ ద పార్లమెంట్, వాట్ ఈస్ ద అసెంబ్లీ, ఇందులో ఎవరెవరు ఉంటారు అని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించగా ఎవరు సమాధానం చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో అధికంగా కుర్చీల కోసం ఉపాధ్యాయులు, పీఆర్ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇది గమనించిన కలెక్టర్ ఆఫీస్ రూంలో ఉన్న కుర్చీలను చూసి అనవసరంగా, చూడకుండా ప్రణాళికలు తయారు చేయడం ఏమిటని ఎంపిడిఓ కృష్ణమూర్తి పై, పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులపై కలెక్టర్ మండిపడ్డారు.

ఇకనైనా చూసి ఏమేమి కావాలో, అవసరం ఉన్న వాటికే ప్రణాళికలు చేయాలని ఇందుకోసం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మనోహరాబాద్ పాఠశాలకు వెళ్లారు.అక్కడ అసెంబ్లీ, పార్లమెంట్, లెక్కల ప్రశ్నలను కలెక్టర్ అడుగగా విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పారు. దీనితో వారిని ఆయన అభినందించారు. కాళ్లకల్ పాఠశాలలో డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్ కావాలని సర్పంచ్ నత్తి మల్లేష్ కలెక్టర్‌ను కోరగా తక్షణమే మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మన ఊరు - మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు, వసతుల ఏర్పాటు కోసం పక్కా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రణాళికల ఏర్పాటు సమావేశానికి సర్పంచ్‌లను, ఎస్ఎంసి ఛైర్మెన్‌లను తప్పనిసరిగా పిలవాలని కలెక్టర్ ఆదేశించారు.


ఎస్ఎంసి, దాతల పేర్లపై బ్యాంకుల్లో అకౌంట్‌లు తెరవాలని సూచించారు. ఎవరైనా దాతలు పాఠశాల అభివృద్ధికి రూ. 2 కోట్లు సహాయం చేస్తే పాఠశాలకు వారి పేరు పెడతామని తెలిపారు. అలాగే రూ. 10 లక్షలు ఇస్తే ఒక్క తరగతి గదికి వారి పేరును పెడతామని తెలిపారు. అంతకుముందు కాళ్లకల్ పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులు చేసిన గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. సర్పంచ్ నత్తి మల్లేష్, ఎంపీటీసీ లావణ్యలు కలెక్టర్‌కు పలు రకాల పుస్తకాలను అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట మనోహరాబాద్ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్, జిల్లా నాయకులు పురం రవికుమార్ ముదిరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed