కేజీబీవీలో వసతులు, విద్యా ప్రమాణాల పై కలెక్టర్ ఆరా

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

కేజీబీవీలో వసతులు, విద్యా ప్రమాణాల పై కలెక్టర్ ఆరా
X

దిశ, ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల హాజరు, రోజువారీ హాజరు శాతం, గైర్హాజరు విద్యార్థుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, వారిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, వంటశాల, స్టోర్‌రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్.. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఆహార నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ లావణ్య, ఎంఈవో మహదేవరెడ్డి, ఎస్‌వో పద్మ, జీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story