తక్షణమే వరి ధాన్యాన్ని తరలించాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

by Batti.Sumithra |

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదివారం సందర్శించారు.

తక్షణమే వరి ధాన్యాన్ని తరలించాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
X

దిశ, ఉప్పునుంతల : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదివారం సందర్శించారు. సెంటర్లలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ల వద్ద తూకాలు వేసిన అనంతరం మిల్లులకు తరలించిన ధాన్యం పై మిల్లర్లు 'తరుగు' పేరుతో కోత విధిస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీని పై స్పందించిన కలెక్టర్, సెంటర్ల వద్ద ఇప్పటికే తూకాలు వేసిన ధాన్యం పై మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యంతో పాటు తూకం వేసి సిద్ధంగా ఉన్న రెండు వేల బస్తాలను వెంటనే తరలించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు నాలుగు రోజులపాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావద్దని సూచించారు. వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. ఉప్పునుంతల మండలంలో దుందుభి నది సమీపంలో ఉన్నప్పటికీ ఇసుక కొరత ఏర్పడిందని, ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుకింగ్‌లు జరగడం లేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

దీని పై స్పందించిన ఆయన, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా గ్రామపంచాయతీ కార్యదర్శి జారీ చేసే ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఇసుక అందించేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఈ విధానం ద్వారా ఇసుకను తరలించాలని, నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎస్‌వో నరసింహారావు, సివిల్ సప్లై డీఎం రాజేందర్, డీటీ హేమ్లా నాయక్, తహసీల్దార్ సునీత, మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్, విస్తరణ అధికారి రాగా సంధ్య, ఏపీఎం బాల్ చంద్రయ్య, సీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Next Story