- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి పనితీరును సమీక్షించారు.

దిశ, బోధన్ : బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ (ఓపీ) బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు తదితర విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి ఆవరణతో పాటు శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టు ఏజెన్సీకి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి సమక్షంలో బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను నిశితంగా పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గర్భిణులు ఈ ఆసుపత్రికి వస్తున్నారని, ప్రతి నెల సగటున 200 వరకు ప్రసవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికో-లీగల్ కేసులు అధికంగా నమోదవుతున్నందున భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని బోధన్ జిల్లా ఆసుపత్రిలో పోలీసు అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు శాఖకు ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
సీజనల్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం సమకూరుస్తుందని, అయినప్పటికీ వైద్య సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక ఆర్డీఓ నేతృత్వంలో ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఆసుపత్రి నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించి నివేదికలను తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.






