దమ్మపేటలో నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన

by Ratna Kumari |

మండల కేంద్రంలోని నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన జరిగింది.

దమ్మపేటలో నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన
X

దిశ, దమ్మపేట : మండల కేంద్రంలోని నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన జరిగింది. రూ.35 లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించనున్న ఈ భవనానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ గ్రంథాలయం సరస్వతి నిలయమని, పుస్తక పఠనంతో పాటు ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నెలకు ఒక పుస్తకం కొనుగోలు చేసి లైబ్రరీకి విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆమె విమర్శించారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దమ్మపేటలో మహిళల కోసం కమ్యూనిటీ భవనం నిర్మించాలని ఎంపీ రఘురాం రెడ్డిని కోరుతూ, అందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కులు, ప్రజా సమస్యలపై గళం విప్పుతామని తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. దమ్మపేట పట్టణంలోని తాగునీటి పైప్‌లైన్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదినారాయణకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ .. దమ్మపేటలో అధునాతన గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరు చేసిన ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంక్షేమ రంగంలో విశేష సేవలందించినందుకు ఆయన జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయమన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో గిరిజన శిక్షణా భవనం కూడా మంజూరైందని చెప్పారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు దమ్మపేట అభివృద్ధి కోసం రూ.1 కోటి ఎంపీ నిధులు మంజూరు చేసిన రఘురాం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మాట్లాడుతూ గతంలో లైబ్రరీలు దినపత్రికల పఠనానికే పరిమితమయ్యేవని, ప్రస్తుతం నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల సన్నద్ధత, ఉద్యోగావకాశాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అశ్వారావుపేటలో త్వరలో ప్రారంభం కానున్న గిరిజన శిక్షణా భవనంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ.. దమ్మపేటలో లైబ్రరీ కోసం స్థలం కేటాయింపులో ఎమ్మెల్యే ఆదినారాయణ విశేష కృషి చేశారని కొనియాడారు. మండల అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధాకిషోర్, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, గ్రామ సర్పంచ్ పగడాల రమాదేవి, చిన్నశెట్టి యుగంధర్, శ్రీరాముల ప్రసాద్, పగడాల రాంబాబు, దిశా కమిటీ సభ్యురాలు సొంగా ఏసుమణి, పొదిలి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Next Story