- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా జనరల్ ఆసుపత్రిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులను ఆదేశించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఐసీయూ సహా వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తూ అవసరమైన సూచనలు చేశారు. గద్వాల జిల్లా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, ఇతర సిబ్బంది పోస్టులను నిబంధనల ప్రకారం త్వరితగతిన భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో పొదలు పెరిగి అపరిశుభ్రంగా ఉండడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినియోగంలో లేని పాత మంచాలు, వైద్య సామగ్రిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వేలం నిర్వహించి విక్రయించాలని సూచించారు.
ఎగ్జామినేషన్ అండ్ ట్రీట్మెంట్ విభాగంలో మానిటర్ పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రిలో విద్యుత్, మరమ్మత్తులు తదితర పనుల కోసం ఇప్పటికే రూ.50 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంపై సంబంధిత అధికారులను మందలించారు. పై అంతస్తులోని 50 పడకల జనరల్ వార్డుకు వెళ్లే ర్యాంపుపై అత్యవసరంగా పైకప్పు నిర్మించాలని గుత్తేదారుకు ఆదేశించారు. అలాగే రోగుల సహాయకులు వేచి ఉండేందుకు ఆసుపత్రి ఆవరణలో షెడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేస్తామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రి పర్యవేక్షకుల చాంబర్‌లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్, అటెండెన్స్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. చాలా రోజులుగా విధులకు హాజరుకాని వైద్యులను సరెండర్ చేయాలని ఆదేశించారు. అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించిన శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అవసరమైతే నిబంధనల ప్రకారం అదనపు సిబ్బందిని నియమించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సదరం శిబిరం కోసం నిర్మించిన భవనం, రేడియాలజీ, మైత్రి ట్రాన్స్ క్లినిక్ తదితర విభాగాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న వైద్య సిబ్బంది క్వార్టర్స్‌ను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆసుపత్రికి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, వైద్యశాఖ ఏఈ రహీం, వైద్యాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






