‘కాక్రోచ్’ క్రేజీ రికార్డు.. 5 రోజుల్లోనే 14 మిలియన్ల ఫాలోవర్స్

by Muthe.Rajitha |

కేవలం వారం రోజుల క్రితం నెట్టింట పుట్టుకొచ్చిన సెటైరికల్ ప్లాట్‌ఫారమ్ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది.

‘కాక్రోచ్’ క్రేజీ రికార్డు.. 5 రోజుల్లోనే 14 మిలియన్ల ఫాలోవర్స్
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో : సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ఒక అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం వారం రోజుల క్రితం నెట్టింట పుట్టుకొచ్చిన సెటైరికల్ ప్లాట్‌ఫారమ్ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఈ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఏకంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) మందికి పైగా ఫాలో అవుతుండటం విశేషం. ఈ క్రేజ్‌తో సోషల్ మీడియాలో దేశంలోనే అతిపెద్ద పార్టీలైన బీజేపీ (8.7 మిలియన్లు), కాంగ్రెస్ (13 మిలియన్లు) అధికారిక ఖాతాల ఫాలోవర్ల సంఖ్యను కాక్రోచ్ పార్టీ అధిగమించింది.

సీజేపీ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత..

ఈ పరిణామాల మధ్యే భారత్‌లో ఈ సంస్థకు చెందిన అధికారిక ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేస్తూ (బ్లాక్ చేస్తూ) ఎక్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక చట్టపరమైన అభ్యర్థనకు ప్రతిస్పందనగానే ఈ ఖాతాను నిలిపివేసినట్లు ‘ఎక్స్’ నుండి సందేశం వచ్చినట్లు సమాచారం. ఖాతా బ్లాక్ అయ్యే సమయానికి ఎక్స్‌లో దీనికి దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తమ సీజేపీ ఖాతా బ్లాక్ అయినట్లు చూపిస్తున్న పాప్-అప్ స్క్రీన్‌షాట్‌ను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే గురువారం తన వ్యక్తిగత ఖాతాలో పంచుకుంటూ.. ‘మేం ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను భారతదేశంలో నిలిపివేశారు’ అని పేర్కొన్నారు.

గంటల్లోనే కొత్త అకౌంట్‌..

ఖాతాను బ్లాక్ చేసిన కొన్ని గంటల్లోనే కాక్‌రోచ్ జనతా పార్టీ సరికొత్త ‘ఎక్స్’ ఖాతాను ప్రారంభించి విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎక్స్‌లోకి తిరిగి వచ్చిన కేవలం గంట వ్యవధిలోనే తమ విమర్శకులను ఎగతాళి చేస్తూ రెండు కొత్త పోస్ట్‌లను షేర్ చేసింది. ఒక పోస్ట్‌లో “మమ్మల్ని వదిలించుకోవచ్చని మీరు అనుకున్నారా? లోల్” అని వ్యంగ్యంగా స్పందించగా.. మరొక పోస్ట్‌లో బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్, సీజేపీ అసలు ఖాతా ఫాలోవర్ల సంఖ్యను పోల్చే స్క్రీన్‌షాట్‌లను పంచుకుంటూ.. “వారు మమ్మల్ని బ్లాక్ చేయడానికి అసలు కారణం ఇదే” అంటూ క్యాప్షన్ ఇచ్చి నెట్టింట మరోసారి హల్‌చల్ సృష్టించింది.

మేనిఫెస్టోలో క్రేజీ డిమాండ్లు

ఈ ప్లాట్‌ఫారమ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో చేరడానికి అందుబాటులో ఉంచిన ఫారమ్ ద్వారా ఇప్పటికే 6 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ పార్టీ విడుదల చేసిన వ్యంగ్య మేనిఫెస్టోలో.. ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ పదవులను నిషేధించడం, పార్లమెంటులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, నీట్ పేపర్ లీక్ వివాదాలపై వినూత్న డిమాండ్లను పొందుపరిచారు. అలాగే, ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే రాజకీయ ఫిరాయింపుదారులపై ఏకంగా 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి సామాజిక కార్యకర్త-న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా సరదాగా మద్దతు తెలపడం గమనార్హం.

Next Story