- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహానగరంలో సీఎన్‌జీ సంక్షోభం.. ఫిల్లింగ్ స్టేషన్లలో 6 గంటలు వెయిటింగ్
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు సీఎన్‌జీ పంప్ స్టేషన్లలో సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు సీఎన్‌జీ పంప్ స్టేషన్లలో సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఫిల్లింగ్ స్టేషన్లలో డ్రైవర్లు 6 నుంచి 8 గంటల వరకు క్యూ లో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో వారి రోజువారీ ఆదాయం నష్టపోతూ, ట్రాఫిక్ రద్దీ పెరిగి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రతి వాహన రీఫిల్లింగ్‌కు అదనంగా రూ.10 అక్రమంగా వసూలు చేయడంపై ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వం సరైన ప్రణాళిక చేయకపోవడం, సరఫరా లోపం, సంబంధిత శాఖల పర్యవేక్షణ లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది.
తెలంగాణ పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖలు చూసిచూడనట్లుగా వ్యవహరించడంతోనే ఈ సమస్య పెరుగుతుంది. పలుమార్లు సీఎన్‌జీ సరఫరాను మెరుగుపరచాలి, అక్రమంగా వసూలు చేస్తున్న అదనపు చార్జీలను నిలిపివేయాలి. తప్పిదం చేసిన సీఎన్‌జీ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు. పరిపాలనా వైఫల్యాలతో గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు బాధపడే పరిస్థితి కొనసాగకూడదని, తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు సూచిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ధరలకు దరిదాపుల్లో..
వాహనాల్లో నింపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర బాగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి చేరితుంది. ప్రస్తుతం సీఎన్‌జీ కిలో ధర రూ.96కు చేరగా, ఆటో గ్యాస్ రూ.43.01కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మహా నగరంలో వాహనాల సంఖ్య 85 లక్షలు చేరింది. అందులో సుమారు 85 వేల క్యాబ్‌లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజూ 5 వేల ఆటోలు, 1000 వరకు కార్లు ఉన్నాయి. ఆటోల సీఎన్‌జీ కిట్స్ సామర్థ్యం ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజు 6 వేల కిలో వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కన్నా సీఎన్‌జీ, ఆటో గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజ్ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్‌జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో 22 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్ ఏమ్రాతం తగ్గడంలేదు.
పర్యావరణ అనుకూలమైన ఇంధనం
సీఎన్‌జీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే ఒక రకమైన వాయువు. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడనం చేసి తయారు చేస్తారు. ఇది పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. సీఎన్‌జీ అనేది పర్యావరణానికి అనుకూలమైన ఇంధనం. సీఎన్‌జీ తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణానికి తక్కువ హానికరమైనది. ఇది గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. సీఎన్జీని వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. దీని కోసం, వాహనంలో ప్రత్యేకంగా సీఎన్‌జీ కిట్ అమర్చబడి ఉంటుంది.






