- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దావోస్‌లో CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వాతావరణంలో పెను మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు.
గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి నమూనాను వివరించారు. కోర్ హైదరాబాద్ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను సీఎం ప్రస్తావించారు. తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువుల అతి వినియోగం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరంపై సమావేశంలో ప్రతినిధుల బృందం చర్చించింది. సమస్యల పరిష్కారానికి, సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
సీఎంతో పాటు సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విస్తృత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా, టీ-ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుందని వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.






