- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడిపోయిన, పడిపోయిన వాళ్ల గురించి ఇక పట్టించుకోను: CM రేవంత్ కీలక నిర్ణయం
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ జిల్లాకు ఘనమైన పోరాట చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్ర పాలకులతో పాటు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ఆదిలాబాద్ జిల్లా అన్యాయానికి గురైంది. బీఆర్ఎస్ నేతలు పట్టించుకుని ఉంటే చనాకా-కొరాటా ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. తాము పక్కా ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి ముందుకు వెళ్తున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది. ఎవరూ అడ్డుపడకుండా పార్టీలకు అతీతంగా సహకరించండి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను కూడా నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేస్తాం. స్టేడియం, కొత్త కలెక్టరేట్‌తో పాటు ఇక్కడి నేతలు కోరినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. అసెంబ్లీలో ఆదిలాబాద్ నేతలతో పత్యేకంగా సమావేశం జరిపి.. బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేస్తాం. బడ్జెట్ సమావేశాలలోపే తుమ్మడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఆదిలాబాద్‌లో ప్రతీ ఎకరాకు నీరందిస్తాం. ఎర్రబస్సు రావడమే కష్టంగా ఉండే ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్టు తీసుకొస్తాం. దానికి స్వయంగా ప్రధాని మోడీ చేత ప్రాంభింపచేస్తాం. అతిపెద్ద పారిశ్రామిక వాడను కూడా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం.. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అందరం కలిసి అభివృద్ధికి కృషి చేద్దాం. పదే పదే ప్రధాని మోడీని కలుస్తున్నా.. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాను. ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా. ఎక్కడికైనా వెళ్తా. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏనాడూ పాకులాడలేదు. అడగకపోతే అమ్మ కూడా పెట్టదు అంటారు.. అందుకే ప్రతీసారి వెళ్లి పరిస్థితిని మోడీకి వివరించి అభివృద్ధికి సహకరించండి అని మోడీని కోరుతున్నాను.
బీఆర్ఎస్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి :
పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇవాళ పరిస్థితి ఇలా తయారయింది. అప్పు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచారు. వాళ్లు చేసిన గందరగోళం అంతా ఇంతా కదు. ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. ఆర్టీసీల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. సన్నవడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చాం. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులను చేశాం. ఒక్కొక్కటి అమలు చేస్తూ అందరినీ కాపాడుకుంటూ వెళ్తున్నాం. మన పౌరుషానికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మ ఆలయాలను అద్యద్భుతంగా నిర్మిస్తున్నాం. రేపు జాతర ప్రారంభానికి ముందే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. మేడారం జాతరకు కూడా మా అక్కలు, అమ్మలు ఉచితంగా బస్సులో వెళ్లి దర్శించుకుని రావచ్చు.
పనిచేసే వారిని మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నుకోండి:
ప్రపంచమంతా హైదరాబాద్‌కు వైపు చూసేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంటే.. కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు వారికి రాజకీయ సమాధి కట్టడం ఖాయం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కేసీఆర్.. అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారు. ప్రజలంతా ఫామ్‌హౌజ్‌లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ గురించి ఆలోచించాలి. దేశంలోనే తెలంగాణను నెంబర్ స్టేట్‌గా నిలుపుతాం. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి. ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసేవారికి ఆ ప్రాంతానికే ఉపయోగం జరుగుతుంది. డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే.. ఆ తర్వాత ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుంది. ఓడిపోయిన వారి గురించి ఎక్కువ మాట్లొద్దని నిర్ణయించుకున్నాను. ఒక్క వేటుకే ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యిండు. మైక్ టైసన్‌లా మనం పంచ్ ఇస్తే కథ ముగిసింది. అందుకే ఇక వారి గురించి మాట్లాడొద్దని ఫిక్స్ అయ్యా. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.






