సంక్రాంతి వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. DAపై సీఎం రేవంత్ ప్రకటన

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. DAపై సీఎం రేవంత్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగుల డైరీ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి కొందరు కావాలనే కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. గత పాలకులకు రూ.లక్షా 11 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చారు. తాము ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఫామ్‌హౌజ్‌లో శుక్రాచార్యుడులాంటి వ్యక్తి ఉన్నారని అన్నారు. యజ్ఞాలు చేస్తుంటే మారీచులు అడ్డంకులు సృష్టించినట్లు సృష్టిస్తున్నారని తెలిపారు. పదే పదే ప్రజలు తిరస్కరిస్తున్నా కూడా వారిలో మార్పు రావడం లేదని అన్నారు.

ఉద్యోగులే బాస్‌లు

బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ.. ప్రజలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు మంచి చేద్దామని ప్రభుత్వం చూస్తుంటే.. ఇప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీసారి దివాలా తీశామని చెప్పుకున్నా కూడా మనకే ఎక్కువ నష్టమని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని తెలిపారు. తాము నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాం.. అమలు చేయాల్సింది ఉద్యోగులే అని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రతినిధులు రెండు వందల మంది ఉంటే.. ఉద్యోగులు పది లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఉద్యోగులే కీలకమని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నా, చెడ్డపేరు తీసుకురావాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉందని అన్నారు. ఉద్యోగుల్లో కొంతమందికి నేనంటే ఇష్టం లేకపోయినా.. దయచేసి చెడ్డపేరు తీసుకొచ్చి పని ఎవరూ చేయొద్దని కోరారు. ఇష్టం ఉన్నా.. లేకున్నా మనందరం కలిసి పనిచేయాల్సిందే అని అన్నారు. పెద్ద మనసు చేసుకుని సహకరించాలని కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి వస్తే సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ బాధ్యత ఎక్కువ పెరుగుతుందని.. ఒక పార్టీ నేతగా రోజుకు 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వాన్ని నడపాలంటే ఎక్కువ సమయం కావాలి, అందుకు అనుగుణంగా ఎక్కువ కష్టపడుతున్నామని అన్నారు.

జిల్లాల విభజనకు కమిటీ

ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో డీఏ ఫైల్‌పై సంతకం చేశాను. సీఎం వస్తున్నారంటే ఏదో వస్తుందని ఆశిస్తుంటారు. అందుకే ఎవరినీ నిరాశ పర్చకుండా డీఏ ఇస్తున్నాం. ఇప్పుడు పెంచుతున్న డీఏ కారణంగా రూ.227 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడబోతోంది. అయానా ఉద్యోగుల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ప్రమాద బీమా కూడా కోటి రూపాయలు అమలు చేస్తాం. ఉద్యోగులు అడిగిన సమస్యలు అన్నీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో జిల్లాల పునర్విభజన అర్ధంపర్థం లేకుండా చేశారు. జిల్లాల విభజనను రిటైర్డ్, మాజీ అధికారులతో కమిటీ వేస్తాం. వచ్చిన అభ్యంతాలు అన్నీ పరిష్కరిస్తాం. గతంలో నాలుగు మండలాలతో, ఐదు మండలాలతో జిల్లాలు చేశారు. ఇప్పుడు అలా ఉండదు. శాస్త్రీయంగా జిల్లాల విభజనను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story