వాసాలమర్రికి త్వరలో సీఎం రేవంత్.. జోరుగా అభివృద్ధి పనులు

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రానున్నారు.

వాసాలమర్రికి త్వరలో సీఎం రేవంత్.. జోరుగా అభివృద్ధి పనులు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రానున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న అయిలయ్య, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వాసాలమర్రి గ్రామాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలలో నిర్వహించనున్న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాసాలమర్రి గ్రామానికి రానున్నట్లు వెల్లడించారు. సీఎం పర్యటనకు ముందే గ్రామంలోని అన్ని అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయం అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాసాలమర్రిని రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా నిలబెట్టేందుకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story