- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మకుటంలో మరో మణిహారం.. ఎఫ్సీడీఏ ఆఫీస్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ ప్రభుత్వం మీర్‌ఖాన్‌పేటలో నిర్మించిన నూతన ఎఫ్సీడీఏ (FCDA) ఆఫీసును సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అద్భుతాల నగరంగా ఉండనుంది. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తునిచ్చే నగరంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే టీజీఐఐసీ, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) సంయుక్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో 8 జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 20 ఎకరాల్లో యూనివర్సిటీ, 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ జోన్, 663 ఎకరాల్లో హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, 508 ఎకరాల్లో ఏఐ జోన్, 500 ఎకరాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, 1500 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్, 2 వేల ఎకరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంస్థాగత అధికారాలు..
తెలంగాణ పట్టణ ప్రాంతాల (అభివృద్ధి) చట్టం, 1975 ప్రకారం ఎఫ్సీడీఏ పనిచేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అత్యంత ప్రభావవంతమైన ప్రణాళిక, అమలు సంస్థగా దీన్ని రూపొందించారు. సమగ్ర పట్టణ ప్రణాళికలో భాగంగా మాస్టర్ ప్లాన్‌లు, జోనింగ్ నిబంధనలు, అభివృద్ధి నియంత్రణ ప్రమాణాల తయారీ చేయడంతోపాటు అమలు చేయాల్సిన బాధ్యత సైతం ఉంది. భూ నిర్వహణ వినియోగంలో కీలకపాత్ర పోషించనుంది. నివాస, పారిశ్రామిక, సంస్థాగత ప్రయోజనాల కోసం భూ వినియోగ ఆమోదాలు, భూ సమీకరణ, వ్యూహాత్మక కేటాయింపులను పర్యవేక్షించడం వంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రధాన మౌలిక సదుపాయాలైన రోడ్లు, యుటిలిటీలు, మొబిలిటీ కారిడార్లు, పౌర సౌకర్యాల ప్రణాళికల రూపకల్పనకు చర్యలు తీసుకోనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జలాశయాల సంరక్షణ, పట్టణ అటవీకరణ, నెట్-జీరో మౌలిక సదుపాయాల నమూనాల ద్వారా సుస్థిరతను ఏకీకృతం చేయడం వంటి కార్యక్రమాలను ఎఫ్సీడీఏ చేపట్టనుంది.
గ్రోత్ కారిడార్‌గా..
ఎఫ్సీడీఏ పరిధి గ్రోత్ కారిడార్ సమీపంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్ హైవే సరిహద్దులుగా కలిగి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ప్రధాన నగరాన్ని రద్దీ నుంచి విముక్తి కల్పించి, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, సుస్థిర జీవనం, ఆర్థిక చైతన్యాన్ని ప్రతిబింబించే సువ్యవస్థిత ప్రత్యామ్నాయాన్ని అందించడం అథారిటీ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతోపాటు మెట్రోరైలు కోసం 20 మీటర్ల సెంట్రల్ మీడియన్‌ను కేటాయించారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ కారణంగా ఎఫ్సీడీఏ పరిధిలో ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, నివాస ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా మరింత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.
2.11 ఎకరాల్లో ఎఫ్సీడీఏ ఆఫీస్..
భారత్ ఫ్యూచర్ సిటీ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఎఫ్సీడీఏ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.19 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా నేడు సాయంత్రం 4గంటలకు ఎఫ్సీడీఏ నూతన ఆఫీసును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. కాగా ఫ్యూచర్ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో 16వేల ఎస్ఎఫ్టీలో జీ+1 నూతన ఆఫీసు భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవానికి ముందే ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు పొందడం విశేషం. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ల ఎగవేతపై పోలీస్ శాఖ నిషేధం విధించింది.






