నర్సుల ఆగ్రహానికి లొంగిన హర్యానా మహిళా కమిషన్ చీఫ్.. రేణు భాటియా రాజీనామా

by Malleboina Mahesh |

హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

నర్సుల ఆగ్రహానికి లొంగిన హర్యానా మహిళా కమిషన్ చీఫ్.. రేణు భాటియా రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానా రాష్ట్రంలో నర్సింగ్ సిబ్బంది నిరసనల సెగతో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా (Renu Bhatia) తన పదవికి రాజీనామా సమర్పించారు. కురుక్షేత్ర లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందిపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను నర్సులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగారు. ఈ ఉద్రిక్తతల నడుమ రేణు భాటియా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి తన రాజీనామా లేఖను పంపించారు. అయితే, తాను కుటుంబ కారణాల వల్ల రాజీనామా చేశానని, నర్సుల డిమాండ్లకు దీనికి ఎలాంటి సంబంధం లేదని, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

వివాదానికి దారి తీసిన ఘటన ఇదే..

కురుక్షేత్రలోని ఒక సివిల్ ఆసుపత్రిలో 62 ఏళ్ల కన్సల్టెంట్ డాక్టర్ ఒకరు 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనపై సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ చీఫ్ రేణు భాటియా.. జూన్ 7న సదరు ఆసుపత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆసుపత్రి లో భద్రతా లోపాలు, నిర్లక్ష్యం వహించారంటూ అక్కడి నర్సులు, అధికారులను ఆమె తీవ్రంగా మందలించారు. విచారణ కూడా జరపకుండా తమపైనే నిర్లక్ష్యపు బ్లేమ్ వేయడం, కొందరు నర్సులకు ఈ కేసుతో లాలూచీ ఉందంటూ ఆరోపించడాన్ని నిరసిస్తూ హర్యానా ప్రభుత్వ నర్సుల సంఘాలు 'పెన్-డౌన్' సమ్మె చేపట్టాయి. ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ సైతం సీఎంకు లేఖ రాస్తూ ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య రేణు భాటియా రాజీనామా లేఖను సమర్పించారు.

Next Story