నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ రియాక్షన్ ఇదే.. ఇంతకీ ఆ కేసేంటి?

by Prasad Jukanti |

తెలంగాణ కోర్టు కేసుల వివరాలు దాచారంటూ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. దీనిపై ఆమె బీజేపీ కుట్ర అంటూ మండిపడ్డారు.

నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ రియాక్షన్ ఇదే.. ఇంతకీ ఆ కేసేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కోర్టు కేసును ఆమె దాచిపెట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీ ఈ నామినేషన్ రిజెక్ట్ చేయగా ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా స్పందించారు. ఇది చట్టపరమైన నిర్ణయం కాదని పూర్తిగా భారతీయ జనతా పార్టీ (BJP) చేసిన రాజకీయ కుట్ర అని ఆమె ఆరోపించారు. జూన్ 18న జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ఇరు పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది.

కాంగ్రెస్‌ను విడదీయలేకే ఈ కుట్ర: నటరాజన్

నామినేషన్ తిరస్కరణ అనంతరం మీనాక్షీ నటరాజన్ మీడియాతో మాట్లాడారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించడంతోనే ఈ వివాదం మొదలైందని ఆమె పేర్కొన్నారు. తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని (క్రాస్ ఓటింగ్) గెలవాలని బీజేపీ భావించింది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యమత్యంతో ఒకే తాటిపై నిలబడటంతో వారి ప్లాన్ ఫలించలేదని విమర్శిచారు. మా ఐక్యతను దెబ్బతీయలేక, చివరకు మమ్మల్ని ఎదుర్కొనేందుకు లేని సమస్యను సృష్టించారని అసలు తెలంగాణలో నమోదైన కేసు క్రిమినల్ కేసు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ కోర్టుకు సంబంధించిన విషయం కేవలం ఒక లీగల్ నోటీసు మాత్రమేనని, అది క్రిమినల్ కేస్ కాదని స్పష్టం చేశారు. కోర్టు ఆ ఫిర్యాదును ఇంకా స్వీకరించలేదని (Cognisance), ఎటువంటి అధికారిక కేసు నమోదు కాలేదని వివరించారు. కాబట్టి నామినేషన్ అఫిడవిట్‌లో ఆ నోటీసు వివరాలను పొందుపరచాల్సిన అవసరం లేదని ఆమె వాదించారు.

ఇంతకీ ఆ కేసేంటి?:

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణం అయిన కేసు తెలంగాణతో ముడి పడి ఉండటంతో అసలు కేసు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ కేసు నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు చంపుతానని బెదిరింపులకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఎ.శ్రీలత అనే మహిళ కుంభం శివకుమార్ పై చేసిన ఆరోపణతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా కుంభం శివకుమార్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరగా ఈ విషయంలో మీనాక్షి నటరాజన్ నిరాకరించారని బాధితారాలు ఆరోపించారు. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్‍తో పాటు కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణ పేట డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టెం అభిజయ్ రెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం కింద రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్ నాగోల్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ తో సహా పలువురికి సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్నే రాజ్యసభ నామినేషన్ పత్రాల్లో ఆమె పేర్కోలేదనే కారణంగా ఎన్నికల కమిషన్ ఆమె నామినేషన్ ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story