భూ కబ్జా పర్వం!

by Muthe.Rajitha |

ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది.

భూ కబ్జా పర్వం!
X

ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలాన్ని సర్పంచ్ కుటుంబం ఆక్రమించింది. 1.10 ఎకరాల ప్రభుత్వ భూమిని దౌర్జన్యంగా దున్నేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన స్థలానికి రక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. కంచె చేను మేసినట్లు రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే భూ కబ్జాలకు పాల్పడడంపై నిరసన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి సబ్‌స్టేషన్ స్థలాన్ని కాపాడి, నిర్మాణ పనులు చేపట్టాలని తహశీల్దార్‌ను కోరారు.

- దిశ, ఉప్పునుంతల

దిశ, ఉప్పునుంతల : కంచె చేను మేసినట్లుగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకుని కుటుంబ సభ్యులు దర్జాగా ప్రభుత్వ భూములనే దున్నేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంసానిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 147లో గల 1.10 ఎకరాల గ్రామకంఠం ప్రభుత్వ భూమిని గతంలో రెవెన్యూ అధికారులు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు. కాగా, ఇటీవలి కాలంలో ఎన్నికైన గ్రామ సర్పంచ్ చీమర్ల లలిత వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులైన చీమర్ల తిరుపతయ్య, చీమర్ల శ్రీనివాసులు, చీమర్ల యాదయ్య అక్రమంగా ఆ సబ్‌స్టేషన్ స్థలాన్ని దున్నేశారని గ్రామస్తులు మంగళవారం మండల తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని కాపాడాలని ఫిర్యాదు..

గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు కోసం గతంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మెన్ వేదికగా వర్చువల్‌గా శిలాఫలకం కూడా ప్రారంభించారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల రికార్డుల్లో కాంసానిపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైనట్లు అధికారికంగా ఉన్నప్పటికీ సర్పంచ్ కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా ప్రభుత్వ భూమిని దున్నడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఎలాగని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడి, నిర్మాణానికి సహకరించాలని కోరుతూ పార్టీలకతీతంగా గ్రామస్తులు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ సభ్యుడు కట్ట శేఖర్‌రెడ్డి, కాంసానిపల్లి తండా సర్పంచ్ కాట్రావత్ వాల్యానాయక్, నాయకుడు కొట్టె శ్రీనివాసులు, మాజీ ఉపసర్పంచ్ చింతల నాగరాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు వెల్టూరి రామకృష్ణ, యువ నాయకులు మర్యాద లక్ష్మీనరసింహారెడ్డి, బయ్య నరేష్, మాచర్ల చంద్రు, ఎల్లయ్య, కాట్రవత్తు లచ్చు, గజ్జ శైలు, బొల్లు మల్లయ్య, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story