ట్రాఫిక్ నిలపొద్దు.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు : ముఖ్యమంత్రి ఆదేశాలు

by Muthe.Rajitha |

తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలని గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని CM రేవంత్ రెడ్డి డీజీపీకి స్పష్టం చేసారు.

ట్రాఫిక్ నిలపొద్దు.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు : ముఖ్యమంత్రి ఆదేశాలు
X

దిశ,తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారిని గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్‌కు స్పష్టం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ముఖ్యమంత్రి వాహనాలు వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను సైతం ఆపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. ఈ నేపథ్యంలో డీజీపీ సి.వి. ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు కమిషనర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావిస్తున్నందున క్షేత్రస్థాయి అధికారులు దీనిని బాధ్యతాయుతంగా పరిగణించాలని డీజీపీ దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్‌గా విభజించి ఇతర వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనిఅధికారులకు సూచించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ముఖ్యంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పటిష్టం చేసేందుకు ఒక అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతోందన్నారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ అధికారులను డీజీపీ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, సైబరాబాద్ సీపీ ఎం. రమేష్, మల్కాజిగిరి సీపీ బి. సుమతి, ఫ్యూచర్ సిటీ జాయింట్ సీపీ చందనా దీప్తి, రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీపీ రమేష్ నాయుడు, ఐఎస్‌డబ్ల్యూ ఓఎస్‌డీ కమలాసన్ రెడ్డి, సీఎంఎస్‌జీ ఎస్పీ చక్రవర్తితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీసు కమిషనర్లు పాల్గొన్నారు.

Next Story