- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెడ్పీటీసీ టూ సీఎం.. రేవంత్‌రెడ్డి సంచలన ప్రస్థానం!
రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం.. ఆయన వేసే ప్రతి అడుగు ఒక విజయం... ఆ విజయాలకు ఊపిరి పోసింది మిడ్జిల్ మండలం.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో : రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం.. ఆయన వేసే ప్రతి అడుగు ఒక విజయం... ఆ విజయాలకు ఊపిరి పోసింది మిడ్జిల్ మండలం. ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికలలో ఉద్దండులను మట్టి కరిపించి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని రేవంత్ రెడ్డి సరిగ్గా 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ప్రవేశించి మిడ్జిల్ మండల జెడ్పీటీసీగా పోటీ చేసి అప్పట్లో రాజకీయంలో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందిన రబ్బానినీ ఓడించి చరిత్ర సృష్టించారు. 9 నెలలకే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మరో రాజకీయ ఉద్దండుడు జగదీశ్వర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత వెనుతిరుగని ఆయన రాజకీయ ప్రయాణం మొక్కువోని ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా చేసింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం (2006 జూలై 4న) ఇదే రోజున తాను జడ్పీటీసీగా గెలిచినట్లు ప్రకటించగా.. సరిగ్గా అదే తేదీన ముఖ్యమంత్రి హోదాలో తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రేవంత్‌రెడ్డి నేడు మిడ్జిల్‌లో పర్యటిస్తుండడం రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం షురూ...
సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2006 స్థానిక సంస్థల ఎన్నికల సమయం. రేవంత్‌రెడ్డి తన సొంత మండలం వంగూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించారు. అయితే, రిజర్వేషన్ల మార్పుల వల్ల అక్కడ పోటీ చేసే అవకాశం చేజారింది. మొదట్లో కొంత నిరాశ చెందినప్పటికీ, ఆయన వెనకడుగు వేయలేదు. వెంటనే జనరల్ స్థానమైన మిడ్జిల్ మండలంపై తన దృష్టి సారించారు. అప్పట్లో మిడ్జిల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాకలు తీరిన బలమైన నేత రబ్బాని బరిలో ఉన్నారు. ఆయనను ఢీకొట్టడం అసాధ్యమని చాలామంది వారించినా లక్ష్యం వైపు దూసుకెళ్లే రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
మిడ్జిల్‌ను కుదిపేసిన ఆనాటి 'మైండ్ గేమ్'
పోటీలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీ తరఫున బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడే రేవంత్‌రెడ్డి తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. స్థానిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకుంటూ, అభిమానుల అండతో మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులను (కాంగ్రెస్ మినహా) బరి నుంచి తప్పుకునేలా చేశారు. దాంతో ఈ ఏకైక పోరు ఉమ్మడి రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది. 2006 జూన్ 27న పోలింగ్ జరగ్గా జూలై 4న వెలువడిన ఫలితాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్‌రెడ్డి 1,373 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించి 'సంచలనాల రేవంత్'గా తొలి అడుగు వేశారు అప్పట్లో ఆ విజయం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత తొమ్మిది నెలలకే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులను మాత్రమే కాదు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సైతం ఒప్పించారు. జెడ్పీటీసీ ఎన్నికలలో రబ్బాని బలమైన నాయకుడు గా పోటీలో ఉన్నట్లే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉదండుడిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగి మళ్లీ పోటీలో ఉన్నారు.
ఆయనపై గెలవడం రేవంత్ రెడ్డి తరం అవుతుందా అన్న ప్రశ్నలు మరోసారి తలెత్తాయి. ఆ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలలో అధిక భాగం కాంగ్రెస్ వారే ఉండడంతో రేవంత్ రెడ్డి గెలుపు అంత సులభం కాదు అనుకున్నారు. పార్టీలకు అతీతంగా అందరి అభిమానాలను చూరగొని 21 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు రేవంత్ రెడ్డి. ఆ ఎన్నికలలో మొత్తం ఓట్లు 1106 కాగా 1105 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో రేవంత్ రెడ్డికి 554 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి కి 534 , స్వతంత్ర అభ్యర్థికి ఐదు ఓట్లు వచ్చాయి. మిడ్జిల్ మండలం ఇచ్చిన రాజకీయ జన్మతో అంచలంచలుగా రాజకీయ చతురతతో అడుగులు ముందుకు వేశారు. అది చతురత.. తెగువతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి రాజకీయ ఉద్దండులు గుర్నాథ్ రెడ్డిని ఓడించి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించారు. ఆ తర్వాత మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా నిరాశ చెందలేదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి పలు కీలక పదవులు చేపట్టి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చివరకు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇలా ప్రతి రాజకీయ అడుగుకు కారణమైన మిడ్జిల్ మండలాన్ని, ఆ రోజులలో తన గెలుపు కోసం కృషి చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలవడానికి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలంలో పర్యటిస్తున్నారు.
స్వర్గీయ ద్యాప గోపాల్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో..
ఉమ్మడి పాలమూరు రాజకీయాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేసి ప్రజల హృదయాల్లో తిరుగులేని నేతగా నిలిచిన స్వర్గీయ ద్యాప గోపాల్‌రెడ్డి అప్పటికే స్వర్గస్థులయ్యారు. రేవంత్‌రెడ్డి తన జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గోపాల్‌రెడ్డి ఆశయ సాధన కోసమే తాను పనిచేస్తానని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సెంటిమెంట్ గోపాల్‌రెడ్డి అభిమానులను, ద్వితీయ శ్రేణి నాయకులను రేవంత్ వైపు తిప్పింది. ఈ కృతజ్ఞతతోనే నేడు మిడ్జిల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా పర్యటిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్వర్గీయ ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
వరాల జల్లుపై సర్వత్రా ఆసక్తి!
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన రాజకీయ జన్మభూమికి వస్తున్న రేవంత్‌రెడ్డి మిడ్జిల్ మండలానికి ఎలాంటి నిధులు, అభివృద్ధి పనుల వరాలు ప్రకటిస్తారోనని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, పార్టీ నాయకులు ఇప్పటికే మిడ్జిల్‌లో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.






