భూకబ్జాదారులకు గురువు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |

సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రిక, చానెల్లో ఓ కథనం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

భూకబ్జాదారులకు గురువు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రిక, చానెల్లో ఓ కథనం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. అనవసరమైన ప్రచారం కల్పించి ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని, ఇలాంటి వ్యవహారాల్లోకి తమ మంత్రులను లాగొద్దని హెచ్చరించారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాతలు, చేతలు శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి సహకరిస్తున్నారని అన్నారు. ‘మీకు మీకు మీడియా పంచాయితీలు ఉంటే.. తలుపులు వేసుకొని కొట్టుకోండి. లేదంటే ఒకరి మీద ఒకరు బురదజల్లుకోండి. అంతేకానీ అందులోకి మమ్మల్ని లాగొద్దు. ఆంబోతులు కొట్లాడితే లేగదూడల కాళ్లు విరిగినట్లు.. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటూ మా మంత్రులను బద్నాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోవద్దు’ అని కోరారు. వాస్తవాలను తెలుసుకోవాలని.. రాసే ముందు తనను వివరణ అడగాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 24 గంటలు 365 రోజుల్లో మీడియాకు వివరణ ఇవ్వడానికి అందుబాటులో ఉంటానని చెప్పారు. ‘టీవీలో, ఏ పేపర్లో, ఏ సోషల్ మీడియాలో ఏదైనా వార్త వచ్చినా.. నా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ఎవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్లందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది. నా నాయకత్వం మీద అపోహలు కలిగిస్తుంది’ అని అన్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఏకపాత్రాభినయం చేసేవారని, దుర్యోదనుడు వారే, దుస్సాసనుడు వారేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరం సమష్టిగా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, రెండేళ్లలో ఎలాంటి అవకతవకలకు, తప్పులకు చోటివ్వలేదని స్పష్టం చేశారు. కోల్‌మైన్ టెండర్ల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టంగా, నిఖార్సుగా, నిజమైన అనుభవం ఉన్న వారికే ఇస్తుందని స్పష్టం చేశారు. పైసా అవినీతికి అవకాశం ఇవ్వబోమని చెప్పారు. మరోసారి తమ మంత్రులు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

వారి స్ఫూర్తితోనే పథకాల అమలు..

ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ అన్నారు. పేద వారి గుండెల్లో వారు చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. నేడు విషాదకరమైన రోజు అని.. అదే నందమూరి తారకరామారావు వర్ధంతి అని అన్నారు. ఒకనాడు తెలుగు వారు అంటే మదరాసీలు అని పిలుస్తున్న సందర్భంలో.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చెప్పిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నాడు పేదవారికి పట్టెడన్నం పెట్టాలని.. పేదవాడి కళ్లలో ఆనందం చూడాలని రూ.2 లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారని చెప్పారు. నేడు తమ ప్రభుత్వం ఆ బియ్యం పథకాన్ని మరింత వినూత్నంగా అమలు చేస్తున్నామని అన్నారు. అందుకే దొడ్డుబియ్యం కాకుండా.. సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. నాణ్యమైన బియ్యంతో ప్రతి పేదవాడి కడుపునింపాలని ప్రయత్నించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.15 కోట్ల మందికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలంటే.. ఉన్న వారు ఎవరైనా చనిపోవాలన్న పరిస్థితి ఉండేదన్నారు. కానీ.. ప్రజాపాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదవారికి అందించామన్నారు. వారందరికీ సన్నబియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా రాష్ట్ర నలుమూలల పేద వారికి రేషన్ కార్డు రాకుంటే అందరికీ ఇవ్వాలని అన్నారు. ఇదే ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అని చెప్పారు. తెలంగాణలోనూ ఎన్టీఆర్‌కు అభిమానులు ఉన్నారని.. నారా చంద్రబాబు నాయుడు సహచరులు, అనుచరులు ఉన్నారని సీఎం గుర్తుచేశారు. ఉచిత కరెంటును అందించి.. ప్రతీ పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు ఉండాలని 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ బాధ్యతలు చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఉండాల్సిందేనని.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టారని గుర్తుచేశారు. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లను సరిదిద్దాలని భావించారన్నారు. రూ.1,300 కోట్లు రైతుల బకాయిలను రద్దు చేశారని.. క్రిమినల్ కేసులను సైతం రద్దు చేసిన వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు 24 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రతీ పేద వాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. 52 లక్షల పేదల కుటుంబాలకు.. 30 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ప్రతి పేద వాడికి, తండాలు, గూడెల్లో, పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టాలని.. పేదవారి ఆత్మగౌరవం నిలబెట్టాలని 25 లక్షల ఇళ్లను నాడు వైఎస్సార్ మంజూరు చేశారన్నారు.

పేదలపై బీఆర్ఎస్ కుట్ర

తెలంగాణ వచ్చిన తరువాత పదేళ్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లు అని ఊరించారని.. ఎవరికైనా ఇళ్లు ఇచ్చారా అని అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన మరుక్షణమే గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద వాళ్ల మీద కుట్ర చేసిందని.. పేదలకు ఇల్లు ఉండొద్దని.. వారు ఎప్పుడూ అడుక్కు తినే విధంగా ఉండాలని వ్యవహరించారని అన్నారు. కానీ.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి ఏడాదిలోనే 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేశామన్నారు. ఆ పథకాన్ని ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాములవారి సాక్షిగా ప్రారంభించుకున్నామన్నారు. సన్న బియ్యం పథకాన్ని సైతం ఇక్కడే ప్రారంభించామన్నారు. ఏప్రిల్ తరువాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తమదన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఇళ్లు ఇస్తామన్నారు. పదేళ్లు కేసీఆర్ చేతికి రూ.20 లక్షల కోట్లు వచ్చాయని.. అవి ఎక్కడ పోయాయో కూడా తెలియదని అన్నారు. నాటి ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఇళ్లు నిర్మించినా.. పదేళ్లలో 20 లక్షల ఇళ్లు పూర్తయ్యేవన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరు మీద పేదలను దగా చేశారని అన్నారు. తాము చివరి పేద వాడికి సైతం ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రాలు వేరైనా.. పార్టీలు వేరైనా.. ఎన్టీఆర్‌ను, వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

భూకబ్జాదారులకు గురువు కేసీఆర్

ఇటీవలే తమ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుందని.. మొదటి సంవత్సరం కూడా పూర్తికాకముందే ఒకపక్క శుక్రాచార్యుడు, ఇంకో పక్కన మారీచుడు, సుబాహుడు మీరు దిగాల్సిందేనని బయలుదేరిండని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, గద్దె దిగాలని కారుకూతలు కూస్తున్నారని కేసీఆర్, కేసీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. భూ బకాసురులకు, కబ్జాదారులకు, హత్యలు చేసేటోళ్లకు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకునేటోళ్లకు రాక్షసులకు గురువులాగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. శకుని మామ పన్నాగాలు పన్నినట్లు.. దుర్యోదన వంశాన్ని వెంట పెట్టుకొని ప్రజాపాలనను పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారని అన్నారు. శుక్రాచార్యుడు ఫాంహౌజ్‌లో ఉన్నారని.. మారీచుడు, సుభాహుడైన బావబామ్మర్దుల ముసుగులో అసెంబ్లీకి వస్తున్నారని అన్నారు. చివరకు మారీచుడు చావు రాముడి చేతిలో తప్పలేదన్నారు. నాడు మాయలేడీ రూపంలో వస్తే.. నేడు సోషల్ మీడియాలో మారీచుడు, సుబాహుడు విష ప్రచారం చేస్తున్నారని, లేని అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వాళ్లు గద్దెలు దిగాలి.. ఊళ్లలో బీఆర్ఎస్ గద్దెలు కూలాలి.. అప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని చెప్పారు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్‌ను బొంద పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. నాడు వరి వేస్తే కేసీఆర్ ఉరి అన్నారని.. తమ ప్రభుత్వం సన్న బియ్యం పండించి బోనస్ పొందండి అని ప్రోత్సహిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు సైతం 70వేల నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇచ్చామన్నారు. ప్రతీ సామాజికవర్గానికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ‘నాడు పదేళ్లు టీడీపీ, తరువాత పదేళ్లు కాంగ్రెస్.. అనంతరం పదేళ్లు బీఆర్ఎస్.. ఇప్పుడు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 2034 వరకు మనమే అధికారం. చరిత్ర పునరావృతం అవుతుంది’ అని చెప్పారు.

Next Story