- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.1,474 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
హైదరాబాద్ అర్బన్ పరిధిలో రూ. 1,474 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులకు శంకుస్థాపన.

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కొత్త నిర్మించనున్న ఆఫీసు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) ఆఫీసును ప్రారంభించనున్నారు. వీటితోపాటు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ ను సైతం ప్రారంభించనున్నారు.
నేడు ఎంఎంసీ ఆఫీసు..
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆఫీసు నిర్మాణానికి హెచ్ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్ లే అవుట్ -3లోని 10 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. రూ.98 కోట్లతో నిర్మించనున్న పర్మినెంట్ బిల్డింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు రూ.960 కోట్లతో ఏఓసీలో నిర్మించనున్న ప్రత్యామ్నాయ రోడ్లకు సంబంధించిన పనులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. వీటితోపాటు టీకేఆర్, గాయత్రి నగర్, మందమల్లమ్మ జంక్షన్‌లలో రూ.416 కోట్లతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రేపు సీఎంసీ ఆఫీసుకు..
ఖానా మెట్ గ్రామ పరిధిలోని ముడికుంట సరస్సు సమీపంలో రూ.161కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)కు శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనం జి+8 అంతస్తులతో నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జి+12 వరకు విస్తరించే అవకాశం కల్పించబడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కార్పొరేషన్ పరిపాలనా కార్యకలాపాలు ఒకే చోట కేంద్రీకృతమై ప్రజా సేవల అందింపు మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.
బాచుపల్లి ఫ్లైఓవర్ సైతం..
మియాపూర్ - గండిమైసమ్మ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ ను సైతం సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుండి గండిమైసమ్మ వైపు వెళ్లే భారీ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి బాచుపల్లి ఎక్స్ రోడ్ వద్ద అత్యాధునిక బాచుపల్లి ఫ్లైఓవర్‌ను హెచ్ఎమ్డీఏ నిర్మించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం ఆదా అవుతుంది మరియు ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందుతుంది.
రూ.65.53కోట్లతో నాలుగు లేన్లతో కూడిన 1.3కిలోమీటర్ల ఫైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల బాచుపల్లి క్రాస్ రోడ్డు వద్ద స్థానిక ట్రాఫిక్, దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలు వేరుచేయబడి, ప్రయాణం ఎంతో సులువుగా మారుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కారిడార్‌లో నివసించే ఐటీ ఉద్యోగులకు, విద్యార్థులకు, రవాణా వాహనాలకు ఇది ఎంతో ఊరటనిస్తుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.






