Supreme Court: దేశ చరిత్రలోనే తొలిసారి.. సుప్రీంకోర్టులో 'లాయర్'గా వాదించనున్న సీఎం

by Malleboina Mahesh |

ఈ రోజు సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దేశ చరిత్రలో మొదటి సారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్ గా మారి కోర్టులో వాదించనున్నారు.

Supreme Court: దేశ చరిత్రలోనే తొలిసారి.. సుప్రీంకోర్టులో లాయర్గా వాదించనున్న సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దేశ చరిత్రలో మొదటి సారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్ గా మారి కోర్టులో వాదించనున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు సుప్రీంకోర్టులో SIR మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఏకంగా సీఎం తన రాజకీయ పోరాటం కోసం న్యాయవాది అవతారమెత్తి వాదించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె వేసిన పిటిషన్ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రానుంది.

ముఖ్యమంత్రి నుంచి న్యాయవాదిగా..

సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ తరపున అగ్రశ్రేణి న్యాయవాదులను నియమించుకుంటారు. కానీ, కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ (Jogesh Chandra Chowdhury Law College) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన మమతా బెనర్జీ, ఈ కీలక పోరాటంలో తానే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టులో "పార్టీ-ఇన్-పర్సన్" (Party-in-person) గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా కోర్టులో స్వయంగా వాదనలు వినిపించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడంతో న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అసలు ఏమిటి ఈ SIR వివాదం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం Special Intensive Revision (SIR)ను చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈ SIR పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అమాయక ఓటర్లను, ముఖ్యంగా మైనారిటీలను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలాగే ఎన్నికల సంఘం (Election Commission) అధికారులు డిజిటల్ ప్రక్రియలు, AIని ఉపయోగించి ఓట్ల తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమని ఆమె వాదిస్తున్నారు. ఈ క్రమంలో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను పాత ఓటరు జాబితా ఆధారంగానే నిర్వహించాలని ఆమె తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

ఉత్కంఠ రేపుతున్న విచారణ

కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన మమతా బెనర్జీ (Mamata Banerjee) గతంలో 2003 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. చాలా కాలం తర్వాత లాయర్'గా వాదించనున్నారు. దీంతో నేడు ఆమె న్యాయమూర్తుల ముందు తన గళాన్ని ఎలా వినిపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సంఘాన్ని "బీజేపీ ఏజెంట్"గా ("BJP agent") అభివర్ణిస్తున్న మమత, ఈ న్యాయపోరాటం ద్వారా కేంద్రంపై పైచేయి సాధించాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) రూమ్ నెంబర్ 1 లో జరగనున్న ఈ విచారణపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

Next Story