- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీరుమారని విద్యాశాఖ..అధికారుల తీరుపై సీఎం సీరియస్!
రాష్ట్రంలోని విద్యా శాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం మరోసారి బహిర్గతమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యా శాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం మరోసారి బహిర్గతమైంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నెల 8న సెక్రెటేరియేట్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డిగ్రీ కాలేజీల్లో క్రమంగా తగ్గుతున్న అడ్మిషన్లపై జరిగిన చర్చ సందర్భంగా అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడింది. డిగ్రీ కాలేజీల్లో 4 లక్షల అడ్మిషన్లకుగాను 2 లక్షల అడ్మిషన్లు పూర్తయ్యాయని, ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 10 వేల సీట్లు భర్తీ చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి సీఎంకు వివరిస్తుండగా ఇద్దరు విద్యాశాఖ మహిళా అధికారులు ఇది అజెండాలోని విషయం కాదని దాటవేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం సెక్రెటరీ అజిత్ రెడ్డి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో అడ్మిషన్ల ప్రభావం కీలకమని సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది.
అజెండా పేరుతో టాపిక్ డైవర్ట్..
సమావేశంలో భాగంగా కీలక అంశాలపై చర్చ జరుగుతుండగా కొంతమంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ‘ఇది అజెండాలో లేని విషయం.. దీనిపై ఇప్పుడు చర్చ వద్దు..’ అంటూ మాట దాటవేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సన్నద్ధత లేకుండా సమీక్షలకు ఎలా వస్తారని ఆయన నిలదీసినట్లు సమాచారం. చర్చ సందర్భంలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల వ్యవహారశైలి పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చర్చ సందర్భంగా మాట్లాడుకుంటూ నవ్వుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయనప్పుడు పదవుల్లో ఉండి ప్రయోజనం ఏంటి? అని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయంలో మహిళా అధికారుల ప్రవర్తన తనకు ఇబ్బంది కలిగించిందని, తనను హ్యుమిలేట్ చేసినట్లుగా ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి సైతం ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది.
డిగ్రీ అడ్మిషన్లపై ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి గల కారణాలను విశ్లేషించాల్సిందిగా కోరగా, అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. విద్యా ప్రమాణాలు పడిపోవడమా?, మౌలిక సదుపాయాల కొరతా?, ఉపాధి అవకాశాలు లేకపోవడమా? అనే కోణంలో స్పష్టమైన వివరణ ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారు. గత కొద్ది రోజులుగా కాలేజ్ కమిషనరేట్‌కు, ఉన్నత విద్యా మండలికి మధ్య సఖ్యత లేని విషయం మరోసారి బయటపడిందని అధికారిక వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అంతేకాకుండా సదరు మహిళా అధికారుల వైఖరి సైతం మార్చుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






