ఉద్యోగుల సంఖ్యను 40 శాతం పెంచనున్న ట్రావెల్ బుకింగ్ కంపెనీ క్లియర్‌ట్రిప్!

by Web Desk |
ఉద్యోగుల సంఖ్యను 40 శాతం పెంచనున్న ట్రావెల్ బుకింగ్ కంపెనీ క్లియర్‌ట్రిప్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ట్రావెల్ బుకింగ్ పోర్టల్ 'క్లియర్‌ట్రిప్' ఇటీవల తన ఉద్యోగుల సంఖ్యను 60 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న త్రైమాసికంలో టెక్నాలజీ, ఉత్పత్తి వ్యాపార విభాగంలో ఉద్యోగుల సంఖ్యను మరో 40 శాతం పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా ఈ ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 700కి చేరుకుంటుందని, గతేడాది అక్టోబర్‌లో సంస్థలో 240 మంది ఉద్యోగులతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకునే ఉద్యోగాల్లో కొంత భాగం భారత్‌లోని పలు ప్రాంతాల్లో హోటల్ పోర్ట్‌ఫోలియోలో టెక్నాలజీ, ఉత్పత్తి, వృద్ధి కోసం జరుగుతాయని కంపెనీ పేర్కొంది. 2022 చివరి నాటికి కంపెనీ ఎండ్-టూ-ఎండ్ ట్రావెల్ యాప్‌గా మార్చేందుకు తగిన వ్యూహాన్ని వేగవంతం చేయనున్నట్టు వివరించింది. 'వినియోగదారుల విశ్వాసానికి సంబంధించి కరోనాకు ముందున్న స్థాయిలో రికవరీని చూడగలుగుతున్నాం. అయినప్పటికీ ఇతర రంగాలతో పోలిస్తే తమ పరిశ్రమ నెమ్మదిగానే పుంజుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఉంది. ఈ క్రమంలో వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు మెరుగైన నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోవాలని భావిస్తున్నట్టు' క్లియర్‌ట్రిప్ సీఈఓ అయ్యప్పన్ రాజగోపాల్ అన్నారు.



Next Story

Most Viewed