Technology : కళ్లద్దాలే లైనక్స్ కంప్యూటర్.. చేతిసైగలతో ఏఐ కోడింగ్!

by Javid Pasha |

టెక్నాలజీ ఇప్పుడు ప్రతిచోటా ఇమిడిపోతోంది. ఏఐ మొదలుకొని నానో వరకు పలు రూపాల్లో సహాయపడుతోంది. అలాంటి మరో అద్భుతమే మొనాకో గ్లాస్!

Technology : కళ్లద్దాలే లైనక్స్ కంప్యూటర్.. చేతిసైగలతో ఏఐ కోడింగ్!
X

దిశ, ఫీచర్స్ : క్లౌడ్ కోడ్, ఓపెన్ ఏఐ కోడెక్స్ (OpenAI Codex) వంటి ఏఐ ఏజెంట్లను రన్ చేయాలంటే కచ్చితంగా ల్యాప్‌టాపో, కంప్యూటరో ఉండాల్సిన అవసరమే లేదు. ఇక నుంచి జస్ట్ కళ్లద్దాలు పెట్టుకొని కూడా ఆ పనిచేయవచ్చు! ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ కానీ నిజం. చైనాకు చెందిన మోనాకో (Monako) అనే స్టార్టప్ ఈ సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ప్రపంచంలోనే ఇవి మొదటి వేరబుల్ లైనక్స్ కంప్యూటర్‌గా ప్రకటించబడ్డాయి.

ఏఐ కోడింగ్ ఏజెంట్లను రన్ చేస్తుంది

టెక్నాలజీ ఇప్పుడు ప్రతిచోటా ఇమిడిపోతోంది. ప్రతీ విషయంలో మానవాళికి హెల్ప్ అవుతోంది. ఏఐ మొదలుకొని నానో వరకు పలు రూపాల్లో సహాయపడుతోంది. అలాంటి మరో ఆధునిక అద్భుతమే మొనాకో గ్లాస్. ఒక విధంగా ఇది సాధారణ కంప్యూటర్ లాగా పనిచేసే వేరబుల్ లైనక్స్ కంప్యూటర్ అని చెప్పవచ్చు. ఇందులో MonoOS అనే కస్టమ్ లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థ ఉండటంతో Claude Code, OpenAI Codex వంటి ఏఐ కోడింగ్ ఏజెంట్లను నేరుగా రన్ చేస్తుంది. దీని హెడ్స్-అప్ డిస్‌ప్లే ద్వారా వాయిస్ కమాండ్స్‌తో యాప్‌లు క్రియేట్ చేయడం, కోడ్ రాయడం, రీసెర్చ్ చేయడం వంటివి కూడా ల్యాప్‌టాప్ లేకుండానే చేయవచ్చు.

యూజర్ వాయిస్ గుర్తిస్తుంది

మొనాకో గ్లాస్ బరువు కేవలం 48 గ్రాములు మాత్రమే. సాధారణ గ్లాసెస్ లాగే కనిపిస్తాయి. డిస్‌ప్లే, కెమెరా, స్పీకర్లతో పాటు ప్రత్యేక బోన్ కండక్షన్ మైక్రోఫోన్ (ముక్కుమీద ఉంచి నాసికా ఎముక వైబ్రేషన్ ద్వారా వినడం) ఉంటుంది. ఇది పెద్ద శబ్దం ఉన్న ప్రదేశాల్లో కూడా యూజర్ వాయిస్‌ను స్పష్టంగా గుర్తిస్తుంది. 0.5 TOPS NPUతో చేతి సంజ్ఞల ద్వారా మెనూస్ నావిగేట్ చేయవచ్చు. MonoOS అనే కస్టమ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. ఇందులో చిన్న యాప్‌లు (200-500 KB) సులభంగా రన్ అవుతాయి.

సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసుకోవచ్చు

మరో ప్రత్యేకత ఏమిటంటే.. మొనాకో గ్లాస్ ద్వారానే వాయిస్ ప్రాంప్ట్ ఇచ్చి హైపర్ పర్సనైలైజ్డ్ కస్టమప్ యాప్‌లను కూడా క్రియేట్ చేయవచ్చు. ఉదాహరణకు హ్యాండ్‌రైటింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను LaTeXకి మార్చే‌ యాప్ మాదిరి అన్నమాట. డెవలపర్లు ఎక్కడ ఉన్నా ఏఐ సహాయంతో సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే భవిష్యత్తులో కళ్లకు పెట్టుకునే గ్లాసెస్ ద్వారా కూడా ప్రొడక్టివిటీ సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. సాంకేతిక నిపుణుల ప్రకారం.. ఈ మొనాకో గ్లాసెస్ ధర సుమారు రూ. 34,000($399) ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు మార్కెట్లో అందుబాటులో లేదు. ఇంకా ప్రీ-ఆర్డర్ దశలో ఉంది. ఈఏడాది జులై-ఆగష్టులో రావచ్చునని చెబుతున్నారు.

Next Story